న్యాయ వ్యవస్థకు ఆ రెండే అతిపెద్ద సవాల్
న్యూఢిల్లీ: న్యాయ ప్రక్రియలో జాప్యం, ఖర్చుల భారం న్యాయ వ్యవస్థకు అతిపెద్ద సవాలుగా మారిందని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ వెల్లడించారు. వీటిని అధిగమించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జస్టిస్ ఎన్‌వీ రమణను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) సత్కరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఇతర న్యాయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌వీ రమణ మాట్లాడుతూ బార్ కౌన్సిల్‌తో తనకు ఎనలేని అనుబంధం ఉందని, […]
న్యూఢిల్లీ: న్యాయ ప్రక్రియలో జాప్యం, ఖర్చుల భారం న్యాయ వ్యవస్థకు అతిపెద్ద సవాలుగా మారిందని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ వెల్లడించారు. వీటిని అధిగమించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జస్టిస్ ఎన్‌వీ రమణను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) సత్కరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఇతర న్యాయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌వీ రమణ మాట్లాడుతూ బార్ కౌన్సిల్‌తో తనకు ఎనలేని అనుబంధం ఉందని, తమ మూలాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయని తెలిపారు. జడ్జీగా కంటే బార్ కౌన్సిల్ సభ్యుడిగానే తన జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించానని వెల్లడించారు.
తన మనసులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే స్వాతంత్ర్యం లాయర్‌కు మాత్రమే ఉంటుందని తెలిపారు. న్యాయమూర్తికి ఉన్న బాధ్యతలరీత్య అలా మాట్లాడటం కుదరదని అన్నారు. హక్కుల కోసం పోరాడే రథంలో న్యాయవాదులు కీలకమైన చక్రాలు అని చెప్పారు. న్యాయ విద్య ఒకప్పుడు ధనవంతుల వృత్తిగానే మిగిలిపోయిందని, కానీ, పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయని తెలిపారు. సామాజిక పరిస్థితుల్లో మార్పులతో సమాజంలోని అన్ని వర్గాలకూ లాయర్లు, జడ్జీలుగా రాణించేందుకు అవకాశాలు తెరుచుకుంటున్నాయన్నారు. అయితే, గ్రామీణ, బలహీన వర్గాల నుంచి ఎక్కువ మంది ఔత్సాహికులు ఈ వృత్తికి ఇంకా దూరంగానే ఉంటున్నారనే భావన తనలో ఉందని చెప్పారు.
మహిళా అడ్వకేట్లకు ఎన్నో సవాళ్లు
న్యాయ వ్యవస్థలో మహిళా అడ్వకేట్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. కొద్ది మంది మాత్రమే ఉన్నత స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వెల్లడించారు. 75ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత మహిళలకు అన్ని స్థాయిల్లోనూ కనీసం 50 శాతం ప్రాతినిధ్యాన్ని ఆశిస్తామని, కానీ, ఎంతో కష్టపడితే గానీ సుప్రీంకోర్టులో కేవలం 11శాతం ప్రాతినిధ్యాన్ని సాధించలేకపోయామన్నారు.
లక్షల మందికి న్యాయం అందట్లే
తాము న్యాయ ప్రాప్యతను బలంగా అందిస్తున్నప్పటికీ, ఇంకా లక్షల మంది ప్రజలు కోర్టులను ఆశ్రయించలేకపోతున్నారని జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. న్యాయ ప్రక్రియలో జాప్యం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. ఇవే న్యాయవ్యస్థకు అతిపెద్ద సవాళ్లని, వీటిని అధిగమించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అలాగే, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. సిబ్బంది లేమి, జడ్జీల ఖాళీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయన్నారు. కొన్నిచోట్ల మహిళలకు సరైన వసతులు లేవని, ఆఖరికి టాయిలెట్లు కూడా అందుబాటులో లేవని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో సౌకర్యాల లేమిపై సమచారం సేకరిస్తున్నానని, మరో వారంలో దీనిపై నివేదిక అందుతుందని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో జడ్జీల ఖాళీల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు సీజేఐ తెలిపారు. న్యాయ వృత్తిని కార్పొరేటీకరించడంపై ఆయన మాట్లాడుతూ చాలా మంది లాయర్లు కార్పొరేట్ న్యాయ సంస్థల్లో చేరడాన్ని గమనిస్తున్నానని, ఇది ఆహ్వానించదగినదే. అయినా సంప్రదాయక ప్రాక్టీస్‌లో క్షీణతకు కారణమవుతున్నదని అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజలు కార్పొరేట్ ధరలతో నాణ్యమైన న్యాయ సలహాను పొందలేరని తెలిపారు.
న్యాయశాస్త్రంలో సీజేఐ మేధావి: సొలిసిటర్ జనరల్
న్యాయశాస్త్రంలో సీజేఐ ఎన్‌వీ రమణ గొప్ప మేధావి అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొనియాడారు. మంచి న్యాయవాదిగానే కాకుంగా మంచి వ్యక్తిగానూ జస్టిస్ రమణ పేరు గడించారన్నారు. ‘నాకు సీజేఐ మంచి న్యాయమూర్తిగానే కాకుండా మంచి వ్యక్తిగాను తెలుసు. ఆయన ఆ రెండింట్లోను సమర్థుడు’ అని అన్నారు. మా లాయర్ల కుటుంబానికి అతనే కర్తలాగా వ్యవహరిస్తారు’ అని ప్రశంసల్లో ముంచెత్తారు.
సామాన్యుడికి ప్రాధాన్యం ఇవ్వాలి: కేంద్ర న్యాయశాఖ మంత్రి
భారత న్యాయ వ్యవస్థ సామాన్యుడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవరసరం ఉందని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. మర్యాద గల కుటుంబ నేపథ్యం ఉన్నవారు లేదా గ్రామీణ ప్రాంతాల వారు న్యాయం కోసం సర్వస్వం త్యాగం చేస్తారని, కొన్ని సందర్భాల్లో భూములు, ఆస్తులు కూడా అమ్ముకుంటారని తెలిపారు. కాబట్టి, న్యాయం ఆలస్యం కాకూడదని చెప్పారు. ‘ఆలస్యమైతే న్యాయం తిరస్కరించబడుతుంది’ అని వెల్లడించారు. న్యాయవ్యవస్థకు సీజేఐ రమణ సరికొత్త పంథాను తీసుకొచ్చారని ప్రశంసించారు. ఆయన మనకు ఏం కావాలో సరిగ్గా అవే చేస్తున్నారని కొనియాడారు.