‘గల్ఫ్ ఏ జమాతే’ ట్రాప్‌లో పడ్డారా.?
కూపీ లాగుతున్న నిఘా వర్గాలు దిశ, కరీంనగర్ : అంతర్జాతీయంగా వివిధ శాఖల పేరిట తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న టెర్రరిస్టులు కొంతకాలంగా ‘గల్ఫ్ ఏ జమాతే’ పేరిట కార్యకలాపాలను కూడా కొనసాగిస్తున్నారు. ఈ సంస్థలో పనిచేసే వారు సాధారణ జీవనం సాగిస్తూ ఉపాధి కోసం సౌదీ వంటి దేశాలకు వెళ్లిన వారిని ట్రాప్‌లో పడేస్తారు. విజిటింగ్ వీసాలతో వెళ్లి అక్కడ కష్టాలు పడుతున్న వారిని అక్కున చేర్చుకుని షెల్టర్ ఇవ్వడం చేస్తుంటారు. వారి ఆర్థిక అవసరాలు తీరుస్తూ..ఇక్కడి […]
కూపీ లాగుతున్న నిఘా వర్గాలు
దిశ, కరీంనగర్ : అంతర్జాతీయంగా వివిధ శాఖల పేరిట తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న టెర్రరిస్టులు కొంతకాలంగా ‘గల్ఫ్ ఏ జమాతే’ పేరిట కార్యకలాపాలను కూడా కొనసాగిస్తున్నారు. ఈ సంస్థలో పనిచేసే వారు సాధారణ జీవనం సాగిస్తూ ఉపాధి కోసం సౌదీ వంటి దేశాలకు వెళ్లిన వారిని ట్రాప్‌లో పడేస్తారు. విజిటింగ్ వీసాలతో వెళ్లి అక్కడ కష్టాలు పడుతున్న వారిని అక్కున చేర్చుకుని షెల్టర్ ఇవ్వడం చేస్తుంటారు. వారి ఆర్థిక అవసరాలు తీరుస్తూ..ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, నిరుపేదలైతే ‘హవాలా’ వంటి లావాదేవీలతో డబ్బును ఎరగా వేసి బుట్టలో వేసుకోవడం వంటి కార్యకలాపాలకు మాత్రమే ‘గల్ఫ్ ఏ జమాతే’ పరిమితం అవుతుంది.
ఎవరికీ అనునమానం రాకుండా టెర్రర్ మూలలను పల్లె ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థకు ‘ఐఎస్ఐ’ ఏటా వంద కోట్ల రూపాయల వరకూ వెచ్చిస్తోందని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే గుర్తించాయి. కానీ ఈ సంస్థతో సంబంధం ఉన్న వాళ్లు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చిక్కలేదు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన లింగన్న కారణంగా ‘గల్ఫ్ ఏ జమాతే’ మూలాలు వెలుగులోకి వచ్చినట్టయింది. జమ్మూలోని అర్నియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్మీ జవాన్ రాకేష్.. అనిత పేరిట సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ అకౌంట్ ద్వారా టెర్రర్ సంబంధాలు పెట్టుకున్నారు. రాకేష్ దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు చేరవేస్తున్నాడని గుర్తించారు. ఈ మేరకు జనవరి 5న రాకేష్‌పై అర్నియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అతని అకౌంట్ల లావాదేవీలను కూడా సేకరించారు. ఫిబ్రవరి నెలలో రాకేష్‌కు లింగన్న మూడు సార్లు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించిన విషయాన్ని గమనించారు. దీంతో జమ్మూ పోలీసులు మల్లాపూర్ చేరుకుని లింగన్నను విచారించారు.
పోలీసుల ముందు లింగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ‘మల్లాపూర్ మండలం, మొగిలిపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తనకు బావ వరస అవుతాడని, అతను సౌదీలో నివసిస్తున్నాడని వివరించాడు. సౌదీలో శ్రీనివాస్‌తో పాకిస్తాన్‌కు చెందిన మరో వ్యక్తి కలిసి ఉంటున్నాడని, అతని ఫ్రెండ్‌కు డబ్బులు పంపించమని చెబితే తాను పంపించానని’ లింగన్న వెల్లడించాడు. గూగుల్ పే ద్వారా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసిన తరువాత తన బావ సౌదీ పోలీసులను ఆశ్రయించి.. పాకిస్తానీ తనను మోసం చేశాడని, తాను వేరే అకౌంట్‌కు డబ్బు పంపించాల్సి వచ్చిందని ఫిర్యాదు చేశాడు. అయితే ఆధారాలు లేవని సౌదీ పోలీసులు కేసు నమోదు చేయలేదని లింగన్న చెబుతున్నాడు.
‘గల్ఫ్ ఏ జమాతే’ సభ్యులు ఇలా మచ్చిక చేసుకుని తమకు కావల్సిన పనులు చేసుకుంటూ ముందుకు సాగుతారు. అయితే అప్పటికే తమకు టచ్‌లో ఉన్న రాకేష్ అకౌంట్‌కు వివిధ దేశాల నుంచి డబ్బు రాగా, భారత్ నుంచి కూడా పంపించినట్టయితే ఎలా ఉంటుందనే కారణంగా పాకిస్తానీ.. శ్రీనివాస్ ద్వారా డబ్బు పంపించాడా లేక ఇక్కడి నిఘా వర్గాలకు చిక్కుతామా లేదని గమనించే అలా చేశాడా అన్నది తేలాల్సి ఉంది. శ్రీనివాస్‌కు సౌదీలో పరిచయం అయిన వ్యక్తి గల్ఫ్ ఏ జమాతే ఇస్లామీ సభ్యుడు అయి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆయనకు టెర్రరిస్టు సంస్థలతో ఉన్న సంబంధాలు ఏంటి అన్న విషయాలపై కూడా ఆరా తీసే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలు నిమగ్నమైనట్టు సమాచారం.
Tags: Gulf, Saudi, Jagityal, Linganna, jawan rakesh, Terrorist