మహానగరంలో కలవరం!
దిశ, వరంగల్: ఓరుగల్లులో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. నిన్న ఒక్కరోజే మూడు పాజిటివ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. జనగామ డీఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి సైతం కరోనా వైరస్ సోకినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు ఉద్యోగిని ఎంజీఎంలోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించిన అధికారులు అతడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ ఘటన నేపథ్యంలో మరో ఇరవైకి పైగా పాజిటివ్ […]
దిశ, వరంగల్: ఓరుగల్లులో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. నిన్న ఒక్కరోజే మూడు పాజిటివ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. జనగామ డీఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి సైతం కరోనా వైరస్ సోకినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు ఉద్యోగిని ఎంజీఎంలోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించిన అధికారులు అతడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ ఘటన నేపథ్యంలో మరో ఇరవైకి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతుండగా అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం వార్త వినాల్సివస్తోందనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ అర్భన్, ములుగు, జనగామ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు తగు చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
ఢిల్లీ తెచ్చిన లొల్లి?
గత నెలలో ఢిల్లీలో జరిగిన మర్కజ్ సభలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 52 మంది వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అధికారులు వారంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరినీ కలిశారు.. ఎక్కడికి వెళ్లారు అనే విషయమై ఆరా తీసి వారికి సైతం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిలో ములుగు జిల్లాకు చెందిన ఇద్దరికి, జనగామ జిల్లాలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్థారించారు. జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండకు చెందిన మటన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ రాగా అతడి కుటుంబ సభ్యులు సన్నిహితంగా మెలిగినవారికి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నర్మెట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సైతం మటన్ వ్యాపారి నుంచి మాంసం కొనుగోలు చేసినందున అతడిని సైతం క్వారంటైన్ కు తరలించారు. కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు నిర్వహించారు. దీంతో తోటి సిబ్బంది, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదే విధంగా జనగామ జిల్లా డీఆర్డీఓ కార్యాలయ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు జరుగుతున్న ప్రచారం ఆయా వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే అతడిని ఎంజీఎంలోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించి కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించిన వైద్యులు తదుపరి చర్యలు చేపట్టారు. జిల్లా అధికారి సీసీగా విధులు నిర్వహిస్తున్న అతడు ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన పలు సమావేశాల్లో సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా అధికారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. దీంతో ఆయన రెండు రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. అంతకుముందు సదరు అధికారి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పలు సమావేశాల్లో పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు అధికారులు సమావేశాలకు సంబంధించిన సీసీ పుటేజీలు పరిశీలించే పనిలో పడిపోయారు.
వరంగల్ లో కలవరం
మొత్తంగా గ్రేటర్ వరంగల్లో కరోనా వైరస్ టెన్షన్ కు గురిచేస్తోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారు అధికంగా వరంగల్ నగరానికి చెందిన వారు ఉండటం స్థానికంగా భయాందోళనలు రేపుతోంది. ఇక్కడి నుంచే అత్యధికంగా 28 మంది ఢిల్లీకి వెళ్లి రాగా సుమారు 20 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చే అవకాశాలున్నట్లు వైద్యులు చెబుతుండగా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. వరంగల్ ఎల్బీనగర్, మండి బజార్, కాశీబుగ్గ, చింతల్, ఫింఛన్ పుర, రంగంపేట, హన్మకొండలోని బొక్కలగడ్డ, కుమార్ పల్లి మార్కెట్, కేఎన్ రెడ్డి కాలనీ, సుబేదారి ప్రాంతాల నుంచి సుమారు 160 మందిని గుర్తించి క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాల్లో పికెటింగ్ లు ఏర్పాటు చేసి లోపలి వారిని బయటకు, ఇతరులను లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. అనుమానితులను హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
Tags: Tension, Warangal, Corona, Police, Officers, Tension, Positive