నేటి నుంచి ఆప్షన్లు.. ఆ విషయాల్లో క్లారిటీ లేక ఉద్యోగుల్లో టెన్షన్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​లేని జిల్లాల్లో ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఉద్యోగుల సీనియార్టీ జాబితాను కలెక్టర్లకు అందించారు. ఆయా శాఖలవారీగా సీనియార్టీ జాబితాను ఉమ్మడి జిల్లాలవారీగా నివేదించారు. ప్రస్తుతం జిల్లా స్థాయి కేడర్‌లోనే విభజన ప్రక్రియ మొదలైంది. జిల్లాస్థాయి ఉద్యోగులకే ఆప్షన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 15 వరకు జిల్లా స్థాయిలో పూర్తి చేసి, ఆ తర్వాత జోనల్, మల్టీజోనల్​స్థాయి నుంచి […]

Update: 2021-12-08 21:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​లేని జిల్లాల్లో ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఉద్యోగుల సీనియార్టీ జాబితాను కలెక్టర్లకు అందించారు. ఆయా శాఖలవారీగా సీనియార్టీ జాబితాను ఉమ్మడి జిల్లాలవారీగా నివేదించారు. ప్రస్తుతం జిల్లా స్థాయి కేడర్‌లోనే విభజన ప్రక్రియ మొదలైంది. జిల్లాస్థాయి ఉద్యోగులకే ఆప్షన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 15 వరకు జిల్లా స్థాయిలో పూర్తి చేసి, ఆ తర్వాత జోనల్, మల్టీజోనల్​స్థాయి నుంచి ఆప్షన్లు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లా పరిధిలోని ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించారు.

తాత్కాలికంగా ఆర్డర్ టు సర్వ్ కింద వారికి ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ఏడాది, రెండేండ్ల కాలానికి మాత్రమే ఈ సర్కులర్‌లు ఇచ్చినా.. ఇప్పటి దాకా ఆర్డర్ టు సర్వ్​ కింద కొనసాగిస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరిగింది. బదిలీలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు జోనల్ అంశంపైనా క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తి అయితేనే ఖాళీల సంఖ్య తేలుతుందని ఇప్పటికే సీఎం కేసీఆర్​ ప్రకటించారు. గురువారం నుంచి ఆప్షన్లు ప్రారంభం చేస్తే శుక్రవారం దీనిపై ప్రాధాన్యత ప్రకారం సీనియార్టీ జాబితా, స్పెషల్​ కేటగిరీ క్లెయిమ్స్​ జాబితాను రూపొందించనున్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఈనెల 11 నుంచి 15 వరకు సమావేశమై, 15న బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

ఖాళీ చూపిస్తారా..?

ప్రస్తుతం ఉద్యోగులకు ప్రధాన సమస్య ముందుంది. ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే హైదరాబాద్, రంగారెడ్డితోపాటుగా మెదక్, మహబూబ్​నగర్​ జిల్లాల్లోని కొంత భాగానికి చెందిన ప్రాంతాల్లో అప్పటి జోన్ 5, జోన్​6 నుంచి స్పెషల్​ ట్రాన్స్‌ఫర్, స్పెషల్ కేటగిరీ అంశాల్లో బదిలీ చేసుకున్నారు. కొన్నిచోట్ల డిప్యూటేషన్లపై వచ్చినా.. ఎలాగోలా నెట్టుకువస్తున్నారు. ప్రస్తుతం వీరిని పాత జిల్లాలకు పంపించాలా? లేక ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాల్లోనే ఆప్షన్లు తీసుకోవాలా అనేదానిపై స్పష్టత కరువైంది. అంతేకాకుండా డైరెక్ట్ రిక్రూట్​అయిన జిల్లాల్లో ప్రస్తుతం ఈ పోస్టును ఖాళీ చూపిస్తారా.? లేకుంటే ఇప్పుడు పని చేస్తున్న చోట చూపిస్తారా.? అనే అంశంపై కూడా ఎటూ తేల్చడం లేదు. ఒకవేళ పని చేస్తున్న జిల్లాల్లోనే ఆప్షన్ తీసుకుంటే అదే జిల్లాకు చెందిన స్థానికులు, సీనియర్​ఉద్యోగుల పరిస్థితి ఎలా అనేది కూడా తేలని ప్రశ్నే. దీనికితోడుగా వరంగల్‌లో విద్యాభ్యాసం చేసి, అక్కడే స్థానికత ఉండి, రంగారెడ్డి జిల్లాలో రిక్రూట్ అయితే ఇప్పుడు ఎక్కడ స్థానికత తేల్చాలి? ఎక్కడ ఆప్షన్​ తీసుకోవాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇలాంటివి వేల కేసులు కొనసాగుతున్నాయి.

వీరంతా ఎలా..?

ఒక కొత్త జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే.. ఆ జిల్లాల్లో 10 సూపరింటెండెంట్​పోస్టులు ఉంటే.. ఇటీవల పదోన్నతుల్లో 20 మంది ప్రమోషన్​ పొందారు. వారిని సీనియార్టీ ప్రకారం ఆప్షన్లు ఇస్తే.. ఒకేసారి పదోన్నతులు పొందిన వారి సీనియార్టీని ఎలా పరిగణలోకి తీసుకుంటారో ఎక్కడా వెల్లడించడం లేదు. అంతేకాకుండా స్పెషల్ కేటగిరీ, స్పౌస్​ కేసులు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, 70 శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి పిల్లులున్న ఉద్యోగులకు ఆప్షన్లలో తొలి ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లోనే స్పష్టం చేసింది. ఇలా అయితే ఇప్పుడు కొత్త జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ 90 శాతం వీటితోనే భర్తీ అవుతాయి. దీంతో సీనియార్టీ ప్రకారం ఆప్షన్​ పెట్టుకున్న వారు ఆ జిల్లాల్లో భర్తీ అయితే ఎక్కడకు పంపిస్తారనేది అనుమానంగా మారింది.

 

Tags:    

Similar News