ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన జెరోధా సీఈఓ!
న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ ఆన్‌లైన్ బ్రోకింగ్ స్టార్టప్ కంపెనీ జెరోధా సహ-వ్యవస్థాపకుడు..telugu latest news
న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ ఆన్‌లైన్ బ్రోకింగ్ స్టార్టప్ కంపెనీ జెరోధా సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ తన సంస్థ ఉద్యోగులకు విభిన్నమైన ఆఫర్‌ను ప్రకటించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలోనే పనిచేశారు. అయితే, ఎక్కువ సమయం ఇంట్లోనే కూర్చుని పని చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ కామత్ సరదాగా ఉండేలా తమ ఉద్యోగులు బరువు తగ్గి, ఫిట్‌గా ఉంటే బోనస్ ఇస్తానంటూ ప్రకటించారు. ఇందులో భాగంగా బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) ప్రకారం 25 శాతం కంటే తక్కువ ఉన్న వారికి సగం నెల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్టు తెలిపారు.
కంపెనీలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సగటు బీఎంఐ 25.3 శాతంగా ఉందని, దీన్ని 24 శాతానికి తగ్గించగలిగితే ఉద్యోగులందరికీ సగం నెల జీతం బోనస్‌గా ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. బీఎంఐ సూచీ ఆరోగ్యాన్ని సూచించే మెరుగైన ప్రమాణం కాకపోయినప్పటికీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు సహకరిస్తుందన్నారు. కరోనా, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగుల ఆరోగ్యంలో అనేక మార్పులను గమనించానన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు నితిన్ కామత్ వివరించారు.
ఇది సాధారణంగా ఇచ్చే బోనస్, ఇతర ఇంక్రిమెంట్లు కాకుండా అదనంగా ఇవ్వనున్నట్టు నితిన్ కామత్ పేర్కొన్నారు. కాగా, నితిన్ కామత్ గతేడాది కూడా ఇదే తరహాలో ఆరోగ్య కార్యక్రమం మొదలు పెట్టారు. ఉద్యోగులు ఆరోగ్యం విషయంలో అనుకున్న లక్ష్యాలను చేరుకున్నందుకు లక్కీ డ్రా ద్వారా రూ. 10 లక్షల బహుమతి ఇచ్చారు.