స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి : ఎంపీ మార్గాని భరత్‌రామ్
దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ లోక్‌సభలో
దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా దాన్ని బలోపేతం చేసేందుకు కార్యచరణ రూపొందించాలని కోరారు. ఇందులో భాగంగా ఉక్కు ఫ్యాక్టరీకి క్యాపిటీవ్ మైన్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని సభలో ప్రస్తావించారు. వేలాది ఎకరాల భూమిని ప్రజలు స్వచ్ఛందంగా ప్లాంట్ ఏర్పాటుకు ఇచ్చారని పేర్కొన్నారు. వారందరి ఆశలను వమ్ముచేసేలా.. వారి త్యాగాలను వృధా చేసేలా కేంద్రం వ్యవహరించడం సరికాదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రజలు ఎవరూ ఒప్పుకోరని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎంపీ మార్గాని భరత్ రామ్ రిక్వస్ట్ చేశారు.