ఆస్టియోపొరోటిక్ ఫ్రాక్చర్స్.. నివారణ మార్గాలు

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా 8.9 మిలియన్‌కు పైగా జనాభా.. బోలు ఎముకలో పగుళ్లతో(ఆస్టియోపొరోటిక్ ఫ్రాక్చర్స్)..latest telugu news

Update: 2022-03-11 02:22 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా 8.9 మిలియన్‌కు పైగా జనాభా.. బోలు ఎముకలో పగుళ్లతో(ఆస్టియోపొరోటిక్ ఫ్రాక్చర్స్) బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి మూడు సెకన్లకు ఒక ఫ్రాక్చర్ సంభవిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆస్టియోపొరోటిక్ ఫ్రాక్చర్స్ నివారణ విషయంలో జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వయసు పైబడే వారిలో ఎముకల పగుళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువని.. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అధికమని చెబుతున్నారు. కాగా వయసు-సంబంధిత బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చో చూద్దాం.

వృద్ధులు.. ముఖ్యంగా వృద్ధ మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రభావం అధికం. 50 ఏళ్లు పైబడిన ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు ఈ వ్యాధి బారినపడుతుండగా.. ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో దాదాపు 36 శాతంగా ఉన్న ఆస్టియోపొరోటిక్ ఫ్రాక్చర్స్ ప్రాబల్యం.. నేపాల్‌ 49%, డెన్మార్క్‌ 19%, కెనడాలో 1.6% శాతంగా ఉంది. ఈ రోగుల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది అంతకు ముందులా ఉండలేరని అధ్యయనాలు చెబుతున్నాయి.

వృద్ధాప్యంతో ఎముక నిర్మాణంలో మార్పు :

ఒక్కసారి అభివృద్ధి చెందిన తర్వాత ఇక ఎముకల నిర్మాణంలో ఎలాంటి మార్పు ఉండదనేది అపోహ. స్టేబుల్ స్ట్రక్చర్‌(స్థిరమైన నిర్మాణం)ను కలిగి ఉండి, అంతర్గత అవయవాలను రక్షించడం, యాంత్రిక విధులను(మెకానికల్ ఫంక్షన్స్) నిర్వహించడమే ఎముక ప్రధాన కర్తవ్యం. అయితే ఏజ్ పెరిగేకొద్దీ ఈ విధుల్లో లోపం ఏర్పడుతుంది. ఎముకల్లో నిల్వ చేయబడిన కాల్షియం కంటెంట్ తగ్గిపోయి అవి పెళుసుగా మారతాయి. యాంత్రిక విధుల నిర్వహణ సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. యువకుల కంటే వృద్ధుల్లోనే ఈ ప్రమాద తీవ్రత పది రెట్లు ఎక్కువ కాగా.. 60 నుంచి 65 ఏళ్ల వ్యక్తుల కంటే 85 ఏళ్లకు పైబడిన వ్యక్తుల్లో 10-15 రెట్లు ఎక్కువని అధ్యయనాలు వెల్లడించాయి.

వృద్ధాప్యానికి ఆస్టియోపోరోసిస్ లింక్:

వయసు-సంబంధిత ఎముక వ్యాధి, ఈస్ట్రోజెన్ కారణంగా జరిగే బోన్ లాస్.. ఈ రెండూ వేర్వేరు కాగా ఎముక జీవక్రియలో రెండు రకాల కణాలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆస్టియోబ్లాస్ట్‌లు ఎముకను ఏర్పరిస్తే.. ఆస్టియోక్లాస్ట్‌లు దాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. వయసు మీద పడుతున్న కొద్దీ ఎముక ఏర్పడటం కంటే ఎముక పునశ్శోషణం ఎక్కువగా ఉంటుంది. దీని ఫలితంగా ఎముకల బలం తగ్గి, డిఫిషియన్సీ పెరుగుతుంది. దీనివల్ల బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు పెరిగే ప్రమాదం ఉంది. ఇది వృద్ధుల్లో ఎముక పునర్నిర్మాణ సామర్థ్యంలో తగ్గింపును సూచించడంతో పాటు నెగెటివ్ బోన్ బ్యాలెన్స్‌కు దారితీస్తుంది.

మహిళల్లో ఎందుకు ఎక్కువ?

బోలు ఎముకల వ్యాధి తలెత్తే అవకాశం పురుషుల కంటే స్త్రీలలో నాలుగు రెట్లు ఎక్కువ. ఇందుకు అనేక కారణాలున్నప్పటికీ హార్మోనల్, మోర్ఫలాజికల్ ఫ్యాక్టర్స్ ముఖ్య కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పురుషుల కంటే స్త్రీలు తేలికైన, సన్నగా ఉండే ఎముకలను కలిగి ఉంటారు. కాగా 18 ఏళ్ల వయస్సులో మహిళలు గరిష్ట ఎముక ద్రవ్యరాశిని చేరుకుంటే.. పురుషులు 20 ఏళ్లకు పీక్ బోన్ మాస్‌కు రీచ్ అవుతారు.

ఇంకా, సుదీర్ఘ జీవితకాలం కూడా బోలు ఎముకల వ్యాధి సంభావ్యతను పెంచుతుంది. స్త్రీలలో మోనోపాజ్(రుతువిరతి) వచ్చినప్పుడు హార్మోన్ల విడుదలలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. ఎముక ఆరోగ్యంగా ఉండేందుకు బాధ్యత వహించే ఈస్ట్రోజెన్ లెవెల్.. మోనోపాజ్ దశ తర్వాత గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముక ఖనిజ సాంద్రత తగ్గుతుంది. బోలు ఎముకల వ్యాధి కేసులను పరిశీలిస్తే 75% స్త్రీలకు సంబంధించినవే. చిన్న వయస్సులో రుతువిరతి కలిగి ఉండటం, అధిక ఆహార నియంత్రణ లేదా వ్యాయామం కారణంగా ఆరు నెలలకు పైగా పీరియడ్స్ లేకపోవడం, వయస్సు కంటే (45 ఏళ్లలోపు లేదా అంతకు మునుపే) ముందే గర్భాశయాన్ని తొలగించడం వలన స్త్రీలకు బోలు ఎముకల వ్యాధి బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఈ వ్యాధిని ఎలా తగ్గించాలి?

* ఆరోగ్యకరమైన జీవనశైలి

* స్మోకింగ్, డ్రింకింగ్ మానేయడం

* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

* మితమైన వ్యాయామం ఎముకను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది

* ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, సోయా ఉత్పత్తులు(కాల్షియం అధికంగా ఉండే ఆహారం) తీసుకోవాలి.

* సాల్మన్, కాడ్ లివర్ ఆయిల్ వంటి 'విటమిన్ డి' పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

Tags:    

Similar News