రింగ్‌లో రాణిస్తున్న హార్యానా బాక్సర్ నీతూ ఘన్‌ఘాస్..
దిశ, ఫీచర్స్ : హర్యానాలోని భివానీ ప్రాంతం దేశానికి ఎంతోమంది బాక్సర్స్‌ను అందించింది. ఆ గడ్డపైన పుట్టిన మరో శివంగే ‘నీతూ ఘంఘాస్’. ‘నేను బాక్సింగ్ ఎన్నుకోవడం కాదు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : హర్యానాలోని భివానీ ప్రాంతం దేశానికి ఎంతోమంది బాక్సర్స్‌ను అందించింది. ఆ గడ్డపైన పుట్టిన మరో శివంగే 'నీతూ ఘంఘాస్'. 'నేను బాక్సింగ్ ఎన్నుకోవడం కాదు.. బాక్సింగే నన్ను ఎన్నుకుంది' అని రింగ్‌లో ఇరగదీస్తున్న నీతూ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్దమవుతోంది. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్న బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ (CWG)లో పోటీపడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మేరీ కోమ్ సహా అనేకమంది హేమాహేమీలతో పోటీ పడనున్న 21 ఏళ్ల నీతు.. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి అదరహో అనిపించగా.. చిన్నవయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆమె గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం.
భివానీలోని ధననా గ్రామానికి చెందిన నీతు.. 2012లో తన బాక్సింగ్ కెరీర్‌ను ప్రారంభించే వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తండ్రి కోరికతో పాటు భివానీకి చెందిన ప్రసిద్ధ యోధుడు, ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన విజేందర్ సింగ్ స్ఫూర్తితో బాక్సింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకుంది. ఈమేరకు తన తోటి బాక్సర్ సాక్షీ చౌదరితో కలిసి బాక్సింగ్ ట్రైనర్ జగదీష్ సింగ్ దగ్గర కోచింగ్ తీసుకోవడం ప్రారంభించిన నీతు.. పాఠశాలకు హాజరవుతూనే, ఉదయం, సాయంత్రం రెండున్నర గంటలపాటు శిక్షణను కొనసాగించింది. ఇక కూతురిని రింగ్‌లో యోధురాలిగా చూసేందుకు తపించిన తండ్రి.. ఉద్యోగాన్ని వదిలేసి నిత్యం ఆమెకు అండగా ఉంటూ వచ్చాడు. 2015లో కటి గాయం చికిత్స కోసం కారును విక్రయించిన తండ్రి అప్పులు కూడా చేశాడు. ఇలా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్న తండ్రికి... 2015లో మొదటి నేషనల్ చాంపియన్‌షిప్ గెలుచుకుని బహుమతిగా అందించింది.
విజయదుంధుభి :
2017, 2018 యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో బంగారు పతకాలు, అలాగే 2018 ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో మరో బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా గ్రాండ్ స్టేజ్‌లపై తన ప్రతిభను ప్రదర్శించింది. కానీ 2019లో భుజం గాయం ఆమె పురోగతికి మరోసారి అడ్డంకిగా మారగా, రెండేళ్లపాటు బాక్సింగ్‌కు దూరమైంది. కొవిడ్ మహమ్మారి కూడా శిక్షణకు అంతరాయం కలిగించింది. కానీ విధికి ఎదురెళ్లిన తను విస్తృతమైన శిక్షణ తర్వాత 2021లో గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు స్ట్రాండ్జా మెమోరియల్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని తన కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటింది.
భివానీలో ప్రసిద్ధి చెందిన ఏకైక క్రీడ 'బాక్సింగ్' కాగా.. అందుకే నేను బాక్సర్‌ని కావాలని మా నాన్న కోరుకున్నాడు. అందుకే నన్ను కఠినమైన శిక్షకుడిగా పేరొందిన ట్రైనర్ జగదీష్ దగ్గర ట్రైనింగ్‌కు పంపాడు. చిన్నతనంలో ఆ శిక్షణకు భయపడి ఇంటికి తిరిగి వెళ్లిపోదామనుకున్నాను కానీ మా నాన్న ఆశయం, త్యాగాలు గుర్తొచ్చి ఆగిపోయాను. ఇక జాతీయ శిబిరంలో భాగం కావడం వల్ల నాన్న నా శిక్షణ, ఆహార అవసరాల గురించి ఆందోళన చెందేవాడు కాదు కానీ నన్ను ప్రోత్సహించేందుకు భోపాల్‌లో అద్దెకు ఉండేవాడు. ఇక అప్పటి హర్యానా ప్రభుత్వం పాలసీలో ఏకపక్ష మార్పు కారణంగా ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌కు నగదు బహుమతులు అందజేయడంలో జాప్యంతో, కుటుంబం మరోసారి అప్పుల్లో కూరుకుపోవడం కొద్దిగా బాధించింది. నాకు ఇష్టమైన పంచ్ స్ట్రెయిట్ క్రాస్ కాగా ఆ పంచ్‌లో నైపుణ్యం సాధించిన మేరీ దీదీ వీడియోలను వెయ్యి సార్లకు పైగా చూశాను. ఖాళీగా ఉన్న ప్రతిసారీ ఆమె పోరాటాన్ని చూస్తాను. ఇతర బాక్సర్ల మాదిరిగానే ఆమెపై విజయం సాధించాలనేది నా కల. దురదృష్టవశాత్తు, ఆమె గాయపడింది. నా విజయం తర్వాత ఆమె అభినందనలు పొందడం పతకంతో సమానంగా భావిస్తాను.
- నీతు
మొదట అకాడమీకి వెళ్ళినప్పుడు అక్కడ 100 మందికి పైగా బాక్సర్లు శిక్షణ పొందడం చూశాను. నా కూతురు దేశం తరఫున పతకం సాధిస్తుందనుకుంటే ఆమె శిక్షణకు ఎల్లవేళలా తోడ్పాటునందించేందుకు నా కూతురు వెంటే ఉండాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అద్భుతమైన కోచ్ జగదీశ్, 2008 బీజింగ్ కాంస్య పతక విజేత విజేందర్ సింగ్ సహా అనేక ఇతర వ్యక్తులకు శిక్షణనిచ్చాడు. ఇక నీతు కోసం ఉద్యోగం మానేయడం, అప్పులు చేయడంతో 'దేశం కోసం తన కూతురు ఏదైనా సాధించాలనే తపనతో నా భర్త పిచ్చోడైపోయాడు. కానీ అతడి పిచ్చితనం, నీతు సంకల్పబలమే వారిని గెలిపించాయి' అని నా భార్య ఎప్పుడూ అంటోది.
- నీతు తండ్రి భగవాన్
నీతులో బాక్సింగ్ చేయగల సహజ సామర్థ్యముందని మొదట్లోనే గ్రహించాను. అదే ఆమె తన బలంగా భావించాలని నేను కోరుకున్నాను. ఆమెను అబ్బాయిలతో శిక్షణ పొందేలా చేశాను. నీతుకు ఫోర్‌హ్యాండ్‌లో కచ్చితత్వం ఉండటం వల్లే శిక్షణా సెషన్‌లలో రాణించేలా చేసింది. ఇప్పటికీ ఆమెకు చాలా సహాయపడే ఒక విషయం ఏమిటంటే, ఆమె చాలా అంతర్ముఖ బాక్సర్. ఆమె ఒక పోరాటంలో గెలిచి, అబ్ క్యా ప్రాక్టీస్ కరేంగే సార్ అని అడుగుతుంది. రింగ్‌లో అత్యంత పదునైన మనస్సు కలిగిన బాక్సర్‌గా నీతును అభివర్ణిస్తాను. ఆమె రింగ్ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుంటుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్ పోరుకు ఒకరోజు ముందు ఆమె అనారోగ్యానికి గురై ఉండకపోతే టర్కీలో స్వర్ణం సాధించి ఉండేది.
- జగదీష్, కోచ్