MP Vijayasai Reddy: టీచర్ల సంక్షేమానికి చర్యలు తీసుకోండి: ఎంపీ
దిశ, ఏపీ బ్యూరో : కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో
దిశ, ఏపీ బ్యూరో : కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో ఆవర్‌లో విజయసాయిరెడ్డి కాంట్రాక్ట్ టీచర్ల సమస్యపై ప్రసంగించారు. కాంట్రాక్ట్ టీచర్లను నియమించే ప్రక్రియ రానురాను తీవ్ర సమస్యాత్మకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'మొదట్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిపై టీచర్ల నియామకాలు జరిగేవి. తర్వాత కాలంలో ఇది ప్రాక్టీస్‌గా మారిపోయింది. ప్రస్తుతం దేశంలో 6.5 లక్షల మంది కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారు. అంటే దేశంలోని మొత్తం టీచర్ల సంఖ్యలో 13 శాతం మంది కాంట్రాక్ట్ టీచర్లే. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు, బడుగు బలహీనవర్గాల విద్యార్ధులు అధిక శాతం చదివే స్కూళ్ళలో కాంట్రాక్ట్ టీచర్ల సంఖ్య 41 శాతానికి చేరుకుంది. కేవలం అయిదేళ్ళ వ్యవధిలో దేశ విద్యా రంగంలో లక్ష మంది కాంట్రాక్ట్ టీచర్ల నియామకం జరిగింది' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ టీచర్ల నియామకం తాత్కాలిక ప్రాతిపదికపైన జరుగుతుంది. రెగ్యులర్ టీచర్ల మాదిరిగా వారికి సర్వీసు ప్రయోజనాలు ఉండవు. ఉద్యోగ భద్రత లేదు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తుంటారని ఆయన రాజ్యసభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కారణాల వల్ల కాంట్రాక్ట్ టీచర్లలో రోజురోజుకీ అసంతృప్తి విపరీతంగా పెరిగిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి కారణంగా బోధన పట్ల వారిలో ప్రేరణ కొరవడుతుందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలో టీచర్ల సంక్షేమం నిర్లక్ష్యానికి గురవుతున్నకారణంగా విద్యారంగంలోకి ప్రతిభావంతులైన టీచర్లను ఆకర్షించలేకపోతున్నాం. ఫలితంగా విద్యా బోధనలో నాణ్యత సన్నగిల్లుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో అంటూ భారతీయ సంస్కృతిలో గురువును దైవంతో సమానంగా పరిగణిస్తాం. కానీ టీచర్లందరినీ సమదృష్టితో చూడలేకపోతున్నాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో టీచర్ల సంక్షేమం కోసం కూడా చర్యలు చేపట్టాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.