వైద్య శిబిరాల్లో నయా దందా! చేసేది గోరంత.. దోచుకునేది కొండంత

దిశ, కామారెడ్డి రూరల్: పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా ఉన్నాయి వ్యవసాయ- latest Telugu news

Update: 2022-03-16 11:32 GMT

దిశ, కామారెడ్డి రూరల్: పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా ఉన్నాయి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పశు వైద్య శిబిరాలు. నామమాత్రంగా కొన్ని పశువులకే మందులు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటూ.. గ్రామంలోని అన్ని పశువులకు మందులు వేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, పెద్ద ఎత్తున పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామంటూ.. బిల్లులు పెట్టుకుని స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో 400లకు పైగా పశువులు ఉంటే కేవలం 45 పశువులకు మాత్రమే మందులు పంపిణీ చేసి మమ అనిపించారు. పంపిణీ చేసేది గోరంత చూపించేది కొండంతలా ఉంది వీరి వ్యవహారం.

జిల్లా కేంద్రమైన కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏడాదికి రెండు సార్లు పశువైద్య శిబిరాలు నిర్వహించాలన్న ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా పలు గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రజలకు ఉపయోగపడే విధంగా వైద్య శిబిరాలు ఉండటం లేదన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. కానీ, పొలిటికల్ లీడర్ల ఫోటో పోజుల కోసమే ఈ శిబిరాలు నిర్వహించి తర్వాత చేతులు దులుపుకుంటున్నారని బహిరంగంగానే ఆరోపణలున్నాయి. కామారెడ్డి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో శిబిరం నిర్వహించిన నాయకులు ఫోటోలు దిగి నామమాత్రంగా మందుల పంపిణీ చేసి వెళ్లిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పశువైద్య అధికారులను వివరణ కోరగా.. తమకేమీ తెలియదని, శిబిరం నిర్వహించి మందులు ఇవ్వాలని చెప్పారని, తాము అలాగే చేస్తున్నామని చెప్పడం గమనార్హం. మార్కెట్ కమిటీ చైర్మన్ గ్యార లక్ష్మీ సాయిలు, వైస్ చైర్మన్ కుంభాల రవి యాదవ్, కార్యదర్శిలను ఈ విషయమై వివరణ కోరగా.. ప్రతి సంవత్సరం రెండు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని తమకు లక్ష్యం ఉందన్నారు.

లక్ష్యం మేరకు ఇదివరకే పోతారం గూడెం గ్రామంలో పశు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా అరకొర మందుల మాట వాస్తవమేనన్నారు. శిబిరానికి రూ.20 వేల వరకు ఖర్చు చేయాలని లక్ష్యం ఉందన్నారు. అయితే శిబిరంలో పంపిణీ చేసే మందులను చూస్తే పట్టుమని రూ.ఐదు నుంచి రూ.పది వేలు విలువైన మందులు కూడా లేకపోవడం గమనార్హం. శిబిరానికి వచ్చిన రైతులు తమ పశువులకు సరిపడే మందులు లేకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా శిబిరాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News