రూ. 50 వేలకు.. రూపాయి వడ్డీ ! ఎవరికీ అంతుచిక్కని వడ్డీ వ్యాపారం చిట్కా?
దిశ, కుక్కునూరు : పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో కొత్తరకం వడ్డీ వ్యాపారం తెరపైకి.. Latest Telugu News..
దిశ, కుక్కునూరు : పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో కొత్తరకం వడ్డీ వ్యాపారం తెరపైకి వచ్చింది. ఇప్పటికే పది రోజుల నుంచి కొందరు ఏజెంట్లు గ్రామాల్లో తిష్ట వేశారు. రూపాయి వడ్డీకే ఒక్కొక్కరికి రూ. 50 వేల నుంచి 2, 3 లక్షల వరకు ఎటువంటి తనఖా, షూరిటీ లేకుండా రుణాలు ఇస్తామంటూ ప్రజలకు ఎర వేస్తున్నారు. మీటింగులూ.. ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఆధార్, చిరునామా వంటి వివరాలను ఏజెంట్లు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లు ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు. ఎంత మందో తెలియదు. కానీ లక్షల రూపాయలను వడ్డీకి అప్పులు ఇస్తామంటున్నారు. ముందుగా అన్ని గ్రామాలను చుట్టేశారు. ఆపై ఆధార్ వివరాలు.. చిరునామాలు కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మనిషికి రూ.50 వేలు నుంచి లక్షల్లో అప్పు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. అది కూడా కేవలం రూపాయి వడ్డీ మాత్రమే అంటూ చెబుతున్నారు.
వీరి వలలో పేదలు చిక్కుకుంటున్నారు. ఇప్పటికే వందల మంది నుంచి వివరాలు సేకరించినట్టు సమాచారం. ముక్కు మొహం తెలియని వారు లక్షల్లో డబ్బు అప్పు ఇవ్వడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్కొక్కరి పేరిట రూ.50 వేలు అప్పు ఇస్తామని చెప్పిన సదరు వ్యక్తులు ఇప్పుడు ఒక కొత్త విధానం తెరపైకి తెచ్చారు. ముందుగా సదరు వినియోగదారులకు ఒక గ్రైండర్ అంటగడుతున్నారు. దీని కోసం రూ.1,850 కట్టాలని, ఆ తర్వాత ఒక్కొక్కరి పేరిట రూపాయి వడ్డీకే రూ.50 వేల చొప్పున అప్పు ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఇప్పుడు కుక్కునూరు మండల వ్యాప్తంగా ఇదే చర్చ. ఒక్కొక్కరికి ఆధార్ కార్డు చూసి రూ.50 వేలు ఎలా ఇస్తామని చెబుతున్నారో అర్థం కావడం లేదు. 10 రోజుల్లో రూ.50 వేలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. వడ్డీ వ్యాపారం ముసుగులో వీరు ప్రజల్ని మభ్య పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంది. వాస్తవానికి ఏజెన్సీలో వడ్డీ వ్యాపారం నిషేధం.