TS High Court: సెప్టెంబర్ 23లోపు ఇవ్వండి.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్ లైన్
TS High Court Asks Government to file Report on Right to Education| రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో ప్రభుత్వం, విద్యాశాఖ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్
దిశ, తెలంగాణ బ్యూరో: TS High Court Asks Government to file Report on Right to Education| రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో ప్రభుత్వం, విద్యాశాఖ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. సెప్టెంబర్ 23వ తేదీ వరకు నివేదికను అందించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లాలు కుమ్రం భీం అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవని పలు చానళ్లలో కథనాలు ప్రచురితమయ్యాయి. వాటి ఆధారంగా హైదరాబాద్ నగరంలో న్యాయ విద్య అభ్యసిస్తున్న అభిరామ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది స్వేచ్ఛ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జన్ భుయాన్, సూరేపల్లి నందాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. గిరిజన ప్రాంతాల్లో పదేండ్లుగా గుడిసెలో స్కూళ్లను నడుపుతున్న దుస్థితి తెలంగాణలో ఉందని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఆయా పాఠశాలల్లో బాలికలకు కనీసం మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కూడా లేవని పిటిషనర్ తన పిల్‌లో పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో మంచి నీరు, పరిశుభ్రమైన తరగతి గది, మరుగుదొడ్లు కనీసం కల్పించాల్సిన వసతులు అని పేర్కొన్నారు. వీటిని కల్పించకుంటే విద్యా హక్కు చట్టం, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టేనని నివేదించారు. కాగా, ఇటువంటి అంశంపై భారత సర్వోన్నత న్యాయస్థానంలో పదేండ్ల క్రితమే విచారణ జరిగిందని, ఆ అంశాలు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకునే విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్లీడర్ కోర్టుకు వివరించారు. అయితే, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన చాలా ముఖ్యమైన అంశమని ద్విసభ్య ధర్మాసనం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడుల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకోవాలని కోర్టు ఆకాంక్షిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సర్కారు బడుల్లో సదుపాయాలపై సమగ్ర నివేదికను సెప్టెంబర్ 23వ తేదీ వరకు తమకు సమర్పించాలని కోర్టు.., ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశించింది. ఆ తర్వాతే విచారణ చేపడుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: పొంచి ఉన్న మరో ముప్పు.. ప్రజలకు కేసీఆర్ హెచ్చరిక