'ఎన్నికల ముందు తగ్గించడం.. అనంతరం పెంచడం'.. కేంద్రంపై టీఆర్ఎస్ నేత ఫైర్
దిశ, అచ్చంపేట : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ కొద్ది రోజులు మాత్రమే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్.. Latest Telugu News..
దిశ, అచ్చంపేట : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ కొద్ది రోజులు మాత్రమే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచకుండా.. ఎన్నికల అనంతరం వాటి ధరలు పెంచడం దారుణమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం నగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట క్యాంపు కార్యాలయం నుండి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, జీబీఆర్ ట్రస్ట్ చైర్మన్ గువ్వల అమల, మహిళల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వరకు ధరల పెరుగుదలకు నిరసనగా.. ప్లే కార్డులు చేతబూని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద వంట గ్యాస్ బండలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం సామాన్యుల కష్టాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పాటు సామాన్యుడు వాడే వంట గ్యాస్ ధరను కూడా పెంచుతున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్, బల్మూర్ ఎంపీపీ అరుణ నరసింహారావు, మున్సిపల్ చైర్మన్ నరసింహా గౌడ్, మహిళా సర్పంచులు పద్మ, శారద, కౌన్సిలర్, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.