5జీ స్పెక్ట్రమ్ ధరపై 35 శాతం తగ్గింపును సిఫార్సు చేసిన ట్రాయ్!
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ ధరలకు సంబంధించి గత కొంతకాలంగా టెలికాం..telugu latest news
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ ధరలకు సంబంధించి గత కొంతకాలంగా టెలికాం కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సోమవారం 5జీ సేవలకు ఉపయోగపడే 3300-3670 మెగాహెర్జ్ (ఎంహెచ్‌జెడ్) బ్యాండ్‌లోని 5జీ స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీల రిజర్వ్ ధరలో 35 శాతం తగ్గింపును సిఫార్సు చేసింది. గతంలో ట్రాయ్ ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఒక్కో ఎంహెచ్‌జెడ్ రూ.492 కోట్ల కనీస ధర చొప్పున వేలం వేయాలని సిఫార్సు చేయగా, ఇప్పుడు ఒక్కో ఎంహెచ్‌జెడ్ రూ. 317 కోట్లుగా సిఫార్సు చేసింది. ఇటీవలే 5జీ స్పెక్ట్రమ్ ధరలపై 80-90 శాతం వరకు తగ్గించాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కోరింది.
ప్రస్తుత పరిస్థితిలో కంపెనీలు ఒక్కో ఎంహెచ్‌జెడ్‌కు రూ. 492 కోట్లను వెచ్చించలేవని, దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందించేందుకు ఒక్కో ఆపరేటర్ రూ.49,200 కోట్లు ఖర్చు చేయలేరని వివరించింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ 35 శాతం తగ్గింపును సిఫార్సు చేసింది. టెలికాం సేవల ప్రొవైడర్లకు ఫ్లెక్సిబిలిటీని అందించేందుకు తగిన సిఫార్సులు చేశామని ట్రాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం మీద, వివిధ బ్యాండ్‌లలో రిజర్వ్ ధర గతంలో సూచించిన దానికంటే దాదాపు 39 శాతం తక్కువగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, టెలికాం రంగం దీర్ఘకాలిక వృద్ధి, స్థిరత్వం, లిక్విడిటీని, పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం టెలికాం కంపెనీలకు మారటోరియం సహా సులభమైన చెల్లింపుల వెసులుబాటును అనుమతించాలని ట్రాయ్ వివరించింది. కాగా, ప్రైవేట్ టెలికాం కంపెనీలు 2022-23లోపు 5జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఏడాదిలోగా స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.