రహదార్లపై వార సంతలు.. తలెత్తుతున్న ట్రాఫిక్ చింతలు
దిశ, లక్షెట్టిపేట: ఇటీవల రోడ్డు పక్కన ప్రధాన గ్రామాల్లో వార సంతలు సర్వసాధారణమయ్యాయి..traffic problems in lakshettipet
దిశ, లక్షెట్టిపేట: ఇటీవల రోడ్డు పక్కన ప్రధాన గ్రామాల్లో వార సంతలు సర్వసాధారణమయ్యాయి. రోడ్ల వెంట, ఫుట్ పాత్ లపై వారసంతలతో సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు, వ్యాపారులు అధ్యయనం చేసి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తని ప్రాంతాలను గుర్తించి ఆ దిశగా వార సంతలను ఏర్పాటు చేస్తే బాగుండేది. కానీ, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎక్కడెక్కడ..?
మంచిర్యాల్ నియోజకవర్గంలో 63వ నెంబర్ జాతీయ రహదారిపై లక్షెట్టిపేటలో హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల, దొనకొండ, రాపల్లి గ్రామాల్లో, లక్షెట్టిపేట-బాసర రహదారి మార్గంలో ముత్యంపేట, దండేపల్లి, మేదరిపేట, తాళ్లపేట గ్రామాల్లో రోడ్లపైనే సంతలు నిర్వహిస్తున్నారు.
ఇవీ తిప్పలు..
63వ నెంబరు జాతీయ రహదారిపై ప్రతి గురువారం లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద వార సంత జరుగుతోంది. రోడ్డుకు ఇరు వైపుల వ్యాపార, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేస్తుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై నిలబడి వినియోగదారులు బేరసారాలు ఆడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ వారసంత ఏర్పాటు ప్రమాదకరమైనదని వాహనదారులు చెబుతున్నా.. అధికారులు, పాలకవర్గ ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారుతోంది. ఎనిమిదేళ్ల కిందట ఊత్కూర్ చౌరస్తా వద్ద ఓ టిప్పర్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెల్లగా రోడ్డు పక్కన నిలుచున్న ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. ఎప్పుడు రద్దీగా ఉండే చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై వారసంత ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లక్షెట్టిపేట నుంచి మంచిర్యాలకు జాతీయ రహదారి గుండా ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ జాతీయ రహదారిపై దొనబండ, ముల్కల, వేంపల్లి వద్ద సంతల ఏర్పాటుతో ఇరువైపులా దుకాణాలతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. ముత్యంపేట గ్రామంలో ప్రతి శుక్రవారం నిర్వహించే సంతలో పశువుల అమ్మకాలు ఎక్కువ జరుగుతుంటాయి. రోడ్డు పక్కనే వారసంతతోపాటు పశువుల అమ్మకాల రద్దీతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. దండేపల్లి, తాళ్లపేట, మేదరిపేటలోనూ ఇదే పరిస్థితి. ప్రతి వారసంత మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుండటంతో ఒకేసారి రోడ్లపై రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు సరైన దిశగా పట్టించుకోకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. వ్యాపారులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించి ఇబ్బందులు లేని ప్రదేశాలను గుర్తించి సంతలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.