ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన.. జగ్గారెడ్డి

Update: 2022-02-14 10:09 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వాస్ శర్మ పై కేసు నమోదు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రధాన మంత్రుల కాళ్లకు మొక్కి పూజలు చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు అవే కాళ్లను తొక్కుతున్నారు.

బీజేపీ నేతలకు అసలు విలువలే లేవన్నారు. అస్సాం సీఎం బీజేపీ నేత హిమంత బిశ్వాస్ శర్మ ఒక మూర్ఖుడని మండిపడ్డారు. భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని బీజేపీ రాజకీయం కోసమే వాడుకుంటుందని విమర్శించారు. తల్లి పై ప్రేమ ఉంటే బీజేపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరని నిప్పులు చెరిగారు.

ఇదేనా బీజేపీ సంస్కృతి.? ఇవేనా విలువలు..?

పార్లమెంట్‌లో బీజేపీని ప్రశ్నించిన వారి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే బీజేపీ సంస్కృతా..! జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఒక తల్లి పట్ల సంస్కారం లేకుండా మాట్లాడిన అస్సాం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని, బీజేపీ నేతలకు నీతి, జాతీ లేదా..? అని ఘాటుగా విమర్శించారు. హిమంత బిశ్వాస్ శర్మ తెలంగాణలో అడుగుపెట్టనియ్యమని హెచ్చరించారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానిది త్యాగాల చరిత్ర అని, దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణ త్యాగం చేశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. తాము ప్రధాని పదవిని తృణప్రాయంగా వదిలి మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వారిని ప్రధాని చేసిన చరిత్ర సోనియా కుటుంబానిదన్నారు. ఇకనైనా బీజేపీ నాయకులు ఇలాంటి దిగజారుడు మాటలు మానుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News