ఫ్యాషన్‌గా మారిపోయిన బూతు పదాలు.. వాటి ప్రభావమేనా ?
దిశ, ఫీచర్స్ : పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ‘బూతు పదాలు’ ఫ్యాషన్‌గా మారిపోయాయి. ఒకవేళ ఎవరైనా గట్టిగా దబాయించి ఎందుకలా మాట్లాడుతున్నావని ఒకరిని అన్నారనుకోండి..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు 'బూతు పదాలు' ఫ్యాషన్‌గా మారిపోయాయి. ఒకవేళ ఎవరైనా గట్టిగా దబాయించి ఎందుకలా మాట్లాడుతున్నావని ఒకరిని అన్నారనుకోండి.. 'లైట్ తీసుకోండి. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్' అంటూ వెళ్లిపోతాడు. సమాజ ధోరణిలో బూతులు సాధారణ పదాల్లా మారిపోయాయి. ఇదొక రకమైన బూతు పురాణమైతే.. ఆడవాళ్లనే లక్ష్యంగా చేసుకున్న బూతులు మరో రకం. ఉదాహరణకు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవగా మారితే.. ఆ గొడవ ఇద్దరు మగాళ్ల మధ్యే కానీ లేదా ఆడవాళ్ల మధ్యే కానీ తిట్లు మాత్రం మహిళల చుట్టూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో సమాజంలో ప్రబలంగా ఉన్న స్త్రీద్వేషపూరిత పదాలకు వ్యతిరేకంగా హర్యానాలోని బీబీపూర్‌కు చెందిన యాక్టివిస్ట్ సునీల్ జగ్లాన్ 2014లో 'గాలీ బంద్ ఘర్' క్యాంపెయిన్‌ను ప్రారంభించాడు. దేశంలో లింగ వివక్ష, సెక్సిస్ట్ దూషణలను అరికట్టాలనే లక్ష్యంతో చేస్తున్న ఈ కార్యక్రమం ఆదరణ పొందగా.. ఎనిమిదేళ్లలో ఈ ఉద్యమం సమాజాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకుందాం.
2014లో బీబీపూర్ పంచాయతీ గ్రామ ప్రధాన్ అయ్యే అవకాశం సునీల్‌కు వచ్చింది. సాధారణంగా పంచాయతీలు స్థానిక, భూ వివాదాలను పరిష్కరిస్తాయి. ఈ క్రమంలో పంచాయతీ సెషన్‌లో చర్చలు చాలా వాడివేడిగా జరిగేవి. రెండు పార్టీలు సహనం కోల్పోయి ఒకరికొకరు తిట్టు(గాలీ)కోవడం మొదలెట్టేవారు. ఈ తిట్లు మహిళలను కించపరిచేలా ఉండగా.. సెషన్‌లో ఉన్న మహిళలు కూడా దీన్ని తప్పుపట్టలేదు. కానీ సునీల్ మాత్రం దాన్ని తప్పుగా భావించి, వెంటనే పంచాయతీ సమావేశాల నుంచి కర్స్ వర్డ్స్ (శాప పదాలను) నిషేధిస్తూ తీర్మానాన్ని ఆమోదించాడు. ఇదే 'గాలీ బంద్ ఘర్' కార్యక్రమానికి నాంది పలికింది.
ఇంటి నుంచే మొదలు:
బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో బూతులు మాట్లాడటం సర్వసాధారణంగా మారిపోయింది. చిన్నారులు కూడా ఆ 'లైంగిక దూషణలు' విని పేరెంట్స్‌ను వాటి మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. అంటే సమాజంలో ఈ తిట్లు ఎంత సాధారణీకరించబడ్డాయంటే.. బహిరంగంగా, పిల్లల ముందు మాట్లాడినా పర్వాలేదనే స్థాయికి చేరుకున్నాయి. ఇది గమనించిన సునీల్ తన సొంత ఇల్లు, గ్రామం నుంచే 'గాలీ బంద్ ఘర్' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగానే తన స్నేహితులు, సహోద్యోగులు, వాట్సాప్ గ్రూప్ సభ్యులు 'సెక్సిస్ట్ స్లర్స్' వినియోగించుకుండా నిరోధించగలిగాడు. ఈ క్రమంలోనే స్థూల స్థాయిలో జెండర్ సెన్సిటైజేషన్ క్లాస్‌లను తీసుకోవడం ప్రారంభించిన సునీల్ దాదాపు 500 కంటే ఎక్కువ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈ అసభ్య పదాలపై సెషన్స్ నిర్వహించాడు. ప్రతి నెలా హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మొదలైన ప్రాంతాల్లోని 15 నుంచి 16 గ్రామాలను సందర్శిస్తూ మరింత అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
దాదాపు ఎనిమిదేళ్ల ప్రచారం తర్వాత కూడా ఈ సమస్య ఇంకా కొనసాగుతోంది. దీనికి అత్యంత ముఖ్యకారకాల్లో వెబ్ సిరీస్, యూట్యూబ్‌లను పేర్కొనవచ్చు. వాటిని సులభంగా యాక్సెస్ చేసే అవకాశం ఉండటం, అందులో ఎలాంటి సెన్సార్‌షిప్ లేకపోవడం వల్లే ఈ పదాలు విస్తృతంగా సమాజంలోకి వెళుతున్నాయి. వీటివల్లే నిరంతరం ప్రజలు ప్రభావితమవుతున్నారు. అందుకే మేము ఈ ప్రక్రియను 'దిమాగ్ కా భోజన్' అని పిలుస్తాము. ఆన్‌లైన్ షోలు, సిరీస్‌లు, గేమింగ్, సోషల్ మీడియా వంటి వేదికలు వయస్సు, లింగాల మధ్య సెక్సిస్ట్ స్లర్‌లను సహజంగా మార్చేశాయి. స్త్రీల శరీరాన్ని కించపరిచే శాపపూరిత పదాలు లేదా డబుల్ మీనింగ్ వర్డ్స్ లేకుండా ఏ కామెడీ షో ఉండదంటే అతిశయోక్తి కాదేమో. నిజానికి ఆ బూతు పదాల అర్థాన్ని గుర్తిస్తే అవి స్త్రీలపై ఎంతగా మచ్చ వేస్తాయో తెలుసుకోవచ్చు. ఇది సమస్యే తప్ప తమ తప్పు కాదన్న విషయం ఆడవాళ్లకు కూడా అర్థం కావడం లేదు. ఈ విధమైన ప్రవర్తన ప్రామాణికం కాదని కూడా గ్రహించలేరు. కానీ అన్ని లింగాలు సమానంగా ఉండే సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించడమే నా లక్ష్యం. నా కూతుళ్లకు మంచి భవిష్యత్తును కల్పించాలని కోరుకుంటాను. వాళ్లే నాకు స్ఫూర్తి. ఏదేమైనా ఈ విషయంలో విరమించుకోను, మరిన్ని సెషన్స్ నిర్వహిస్తూ మరింత ప్రచారం చేస్తూ మార్పు తీసుకువస్తాను.
- సునీల్ జగ్లాన్
బేటీ బచావో బేటీ పడావో .. సునీల్ చేపట్టిన కార్యక్రమమే :
ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా చేసే సమయంలో తన స్వగ్రామా(బీబీపూర్)నికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు సునీల్. ఆ తర్వాత వివాహం చేసుకున్న తను ఓ ఆడపిల్లకు తండ్రయ్యాడు. ఆ బాధ్యత తనను విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, లింగ సంబంధమైన అంశాల పట్ల సున్నితంగా ఉండేలా మార్చింది. అయితే వాటిని పెద్దగా పట్టించుకోలేదు కానీ అదే సమయంలో పండుగలు, పెళ్లిళ్లలో స్త్రీ, పురుషుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, ఊళ్లో భ్రూణహత్యల కేసులు ఎక్కువగా ఉన్నాయనే విషయాలు మాత్రం అర్థమయ్యాయి. దీంతో గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్లను సాధారణ పరిశీలన చేయడం ప్రారంభించిన సునీల్, ఆ తర్వాత 2012లో 'బేటీ బచావో'తో పాటు 'బేటీ పడావో' కార్యక్రమాలను ప్రారంభించాడు. ప్రణబ్ ముఖర్జీ దీన్ని మరింతగా స్వీకరించి జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలోని చదువుకునే ఆడపిల్లలకు డబ్బు, పుస్తకాలు సహా లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్లను అందించాడు సునీల్.
బాక్స్
మన సమాజంలో ఒక విస్తృతమైన సెన్సారింగ్‌లా ఉంటూ వచ్చిన సంప్రదాయం, విలువలు, మానవత్వం అనేవి బలహీనం అయ్యాయి. ఒకరి నోటి వెంట వినిపించే బూతు, వారి మనస్తత్వానికి ప్రతీక. అసహ్యకరమైన తిట్లు తిట్టేవారు, వాటిని ప్రాక్టికాలిటీలోకి కూడా తీసుకొస్తారు. దురాచార ఘటనలు జరగడానికి ఇదే కారణం.
- నీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ