కలెక్టరేట్ను ముట్టడించిన గ్రామ కమిటీ.. ఆ అభివృద్ధి ఆపేయాలంటూ నిరసన
దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజ్ 21లో నిర్మిస్తున్న..latest telugu news
దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజ్ 21లో నిర్మిస్తున్న మంచిప్ప(కొండం చెరువు)ను రిజర్వాయర్ పాత డిజైన్ ప్రకారమే నిర్మించాలని భూ నిర్వాసితులు కలెక్టరేట్ను ముట్టడించారు. మోపాల్ మండలం మంచిప్ప పాత చెరువును కొండం చెరువు రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తూ.. నీటి సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 3.5 టీఎంసీలకు పెంచడాన్ని మంచిప్ప, అమ్రాబాద్, కాల్పోల్, బై రాపూర్‌తో పాటు 8 తండాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
ఈ మేరకు సోమవారం కాళేశ్వరం కొండం చెరువు రిజర్వాయర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ముంపు గ్రామ కమిటీ నేతలు గొల్ల శ్రీనివాస్, దేవ శంకర్, రాజేష్, సిద్ధార్థలు మాట్లాడుతూ.. 2012లో మంచిప్ప గ్రామ శివారులో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా కొండెం చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రణాళికలు వేశారని, అందుకు అనుగుణంగా గ్రామ పంచాయతీలో తీర్మానం సైతం చేశారన్నారు.
కానీ దాని విస్తీర్ణం పెంచుతూ 3.5 టీఎంసీలతో లక్షా ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేసిన అంచనాలను గ్రామ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం కాలేశ్వరం ప్యాకేజ 21 పనులను చేపట్టడం ప్రజల ఆమోదం లేకుండా జరుగుతుందన్నారు. వ్యవసాయ సాగు కోసం నీటి సరఫరా మంచి ఉద్దేశంతో కూడిన.. తమకు మాత్రం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదన్నారు. ప్రభుత్వం పాత డిజైన్ ప్రకారమే కొండెం చెరువు రిజర్వాయర్ ను నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రాజెక్టు పనులను అడ్డుకుంటామన్నారు. ఈ నిరసనలో మూడు గ్రామాల ప్రజలు, ఎనిమిది తండాల గిరిజనులు పాల్గొన్నారు.