లోపం ఎక్కడ జరుగుతుంది.. ఆస్పత్రుల అభివృద్ధికి ఇంకేం చేయాలి!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు, పరికరాలు పెరిగినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని సర్కార్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు, పరికరాలు పెరిగినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని సర్కార్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్‌తో పోటీ పడి మనం ఎందుకు సేవలు అందించలేకపోతున్నామనే కారణాలను అన్వేషిస్తున్నది. ఇప్పటికే ఏర్పాటు చేసిన పరికరాలు, స్టాఫ్ పరిస్థితి, పనితీరు ఎలా ఉన్నదంటూ ఆరా తీస్తున్నది. ఆస్పత్రుల అభివృద్ధికి ఇంకా ఏం చేస్తే మేలు జరుగుతుందని ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నది. ఈ మేరకు డాక్టర్లు, మెడికల్ యూనియన్లతో మంత్రి త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఓ కీలక అధికారి తెలిపారు. పూర్తిస్థాయి అభిప్రాయ సేకరణ తర్వాత ఆస్పత్రుల వారీగా అభివృద్ధి పనులను మరింత మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.
రిసీవింగ్, ట్రీట్మెంట్‌లో జాప్యం
సర్కార్ ఆస్పత్రులో స్టాఫ్ తక్కువగా ఉండటం వలన పేషెంట్లను రిసీవింగ్ చేసుకునే తీరు మెరుగ్గా లేదు. ఓపీ, మందులు, డాక్టర్ పరిశీలన, ట్రీట్మెంట్ విధానాల్లో గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉన్నది. అంతేగాక పేషెంట్లు అడిగే వివరాలను కొందరు వైద్యసిబ్బంది స్పష్టంగా చెప్పకుండా సతాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి కొందరైతే దురుసుగా కూడా మాట్లాడుతున్నారు. అంతేగాక మారిన కాలానుగుణంగా వచ్చిన రోగ నిర్ధారణ యంత్రాలు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేవు. దీంతో ప్రైవేట్‌లో అందినంత స్పీడ్‌గా సర్కార్ వైద్యం అందడం లేదు. మరోవైపు శానిటేషన్ వ్యవస్థలో మార్పులు రావాలని ఇటీవల ప్రభుత్వం ప్రస్తుతం చెల్లించే బెడ్ ఛార్జీలను కూడా పెంచింది. కానీ, ఇప్పటికీ ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితులు మారలేదు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్లలో శానిటేషన్ వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్నది. దీంతో మంత్రి ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసి ఆస్పత్రుల్లో సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయనున్నట్లు తెలిసింది.