మానేరు నది ఇసుక స్మగ్లర్లకు అడ్డా..

దిశ, మల్హర్: భూపాలపల్లి జయశంకర్ జిల్లా - The Maneru River has become a haven for sand traders in the Malhar Zone of Bhupalpally Jayashankar District

Update: 2022-04-11 12:54 GMT

దిశ, మల్హర్: భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలం లో ఇసుక స్మగ్లర్లు రాత్రి ఐతే చాలు దర్జాగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మానేరు నదిని ఇసుక వ్యాపారులు అడ్డాగా చేసుకొని అధికారుల ఉదాసీనతను ఆసరా చేసుకుని ఎలాంటి పర్మిషన్ లేకుండా స్మగ్లర్లు ఇసుక తరలిస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు యథేచ్చగా పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తూ స్మగ్లర్లు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ఒక్క ట్రాక్టర్ ట్రిప్ కు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మానేరు నది పరివాహక గ్రామాలైన వలేంకుంట, ఇప్పలపల్లి, మల్లారం, తాడిచర్ల గ్రామాల ఇసుక అక్రమార్కులకు మానేరు నది వరంగా మారింది. మండలంలోని సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీ, రహస్య ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ అక్రమ ఇసుక కుప్పలు దర్శనమిస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు దీంతో ఇసుక స్మగ్లర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉందని.


నిత్యం నడుస్తున్న ఇసుక ట్రాక్టర్ల శబ్దంతో నిద్ర లేకుండా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. మానేరు నది ఇసుక భారీ డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లు రాత్రికి రాత్రే కాటారం, భూపాలపల్లి పట్టణాలకు తరలిస్తూ అక్కడక్కడా భారీ డబ్బులు ఏర్పాటు చేసి లారీల ద్వారా హైదరాబాద్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు అండతో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోయి విచ్చలవిడిగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు స్మగ్లర్లు జేసీబీ, ట్రాక్టర్ డోజర్ లతో నదిలో పెద్ద పెద్ద గుంతలు తవ్వడం తో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీటిమట్టం తగ్గి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక అక్రమ దందాకు రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో స్మగ్లర్లు రెచ్చిపోయి రాత్రి వేళల్లో ఇసుక దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అడపాదడపా దాడులు కేవలం ఫైన్ లతో సరి పెట్టడంతో అక్రమార్కులకు భయం లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. శనివారం,ఆదివారం రాత్రి ఎలాంటి పర్మిషన్ లేకుండా తాడిచర్ల మానేరు నది నుంచి బొగ్గు వెలికి తీస్తున్న ఎమ్మార్ ప్రైవేట్ కంపెనీకి స్మగ్లర్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాపై ఉన్నత అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకొని భూగర్భ జలాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News