దిశ, వేలేరు: రోజువారి లాగే కూలి పనికి వెళ్లిన ఓ మహిళ తిరిగి ఇంటికి వచ్చేసరికి షాక్ కి గురైంది. ఏం జరిగిందంటే తన ఇంట్లో ఉన్న సామగ్రి అంత దగ్ధం అయింది. ఈ ఘటన హన్మకొండ జిల్లా వేలేరు మండలం గుండ్ల సాగర్ గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోనుగాని మంజుల కూలిపని చేస్తూ జీవనం సాగిస్తుంది. రోజు వారి నిమిత్తం కూలి పనికి వెళ్లి వచ్చేసరికి, ఇంట్లో విద్యుద్ఘాతమై వస్తువులు, సామాన్లు అన్నీ కాలిపోయాయి. రోజు కూలి పనికి వెళ్లి దాచుకున్న డబ్బులు దాదాపుగా రూ.15 వేలు కాలి బూడిద అయిపోయని కన్నీరు పెట్టుకుంది. బాధితురాలు ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేసి నన్ను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకున్న సర్పంచ్ ధర్మారెడ్డి బాధితురాలిని ఓదార్చి ఆమెకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్లి వారికి తోచినంత సహాయాన్ని అందించాలని ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేసి దాదాపుగా రూ.40 వేలు సమకూర్చి బాధితురాలికి అందజేసి ఆమెకు ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మారెడ్డి, ఉప సర్పంచ్ ఎల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.