నెరవేరిన ఉమ్మడి మెదక్ ప్రజల కోరిక.. గజ్వేల్‌లో మొదటి రైలు కూత
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవలే ఏర్పాటు చేసిన గజ్వేల్ రైల్వే స్టేషన్‌లో మొదటి రైలు సోమవారం ప్రారంభమైంది. మనోహరాబాద్- గజ్వేల్ సెక్షన్‌లో రవాణా అవుతున్న మొదటి సరుకు రవాణా రైలు కూడా ఇదే.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవలే ఏర్పాటు చేసిన గజ్వేల్ రైల్వే స్టేషన్‌లో మొదటి రైలు సోమవారం ప్రారంభమైంది. మనోహరాబాద్- గజ్వేల్ సెక్షన్‌లో రవాణా అవుతున్న మొదటి సరుకు రవాణా రైలు కూడా ఇదే. దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్‌లో గజ్వేల్ స్టేషన్ ఉంది. ఇక్కడ సరుకుల లోడింగ్, అన్‌లోడింగ్ కోసం ఇటీవలే అనుమతులు ఇచ్చారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా, 21 బీసీఎన్ వ్యాగన్లలో ఎరువులతో కూడిన మొదటి రేక్ కాకినాడ నుంచి బుక్ చేయబడి గజ్వేల్ స్టేషన్‌లోని గజ్వేల్ గూడ్స్ షెడ్‌లో అన్‌లోడింగ్ కోసం ఉంచారని, గజ్వేల్ స్టేషన్‌కు చేరుకున్న మొదటి రేక్ ద్వారా 1,844 టన్నుల ఎరువులు రవాణా చేయబడినట్లు తెలిపారు. గజ్వేల్ స్టేషన్ తెలంగాణ స్టేషన్‌లో ముఖ్యమైన స్టేషన్ అని అన్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్‌లో నూతన రైల్వే లైను నిర్మించినట్లు స్పష్టం చేశారు. మొదటి దశలో 2020 జూన్‌లో మనోహరాబాద్-గజ్వేల్ మధ్య 31 కిమీల మేర నూతన రైల్వే లైన్ పూర్తయ్యి ప్రారంభించినట్లు, మిగతా సెక్షన్లలో పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
గజ్వేల్ స్టేషన్‌లో సరుకు రవాణా నిర్వహణతో సరుకు రవాణా వినియోగదారులు తమ సరుకులను రవాణా చేసి వారి వ్యాపార లావాదేవీల పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుందని అన్నారు. స్టేషన్ పరిసర ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, ఎరువులు వంటి అత్యవసర సరుకులను వేగంగా మరియు తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి కూడా ఇది తోడ్పడుతుందన్నారు. కరీంనగర్ వైపు దగ్గరగా, అనుకూలమైన మార్గంగా ఉండే ఈ రైల్వే లైన్ పనులు మొత్తం పూర్తయితే మెదక్, సిద్దిపేట జిల్లాల నివాసితుల చిరకాల వాంఛ నెరవేరుతుందన్నారు. మొదటి రేక్‌లో ఆదివారం కాకినాడలోని నాగార్జున ఫర్టిలైజర్స్, కెమికల్స్ 1844 టన్నుల ఎరువులు లోడ్ అయ్యాయని, సోమవారం 27 జూన్ 2022 తేదీన గజ్వేల్ స్టేషన్‌కు చేరుకుందన్నారు. ఈ గూడ్స్ రైలు 632 కిమీలు మేర ప్రయాణించిందని తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఒక ప్రకటనలో తెలుపుతూ.. గజ్వేల్ స్టేషన్‌ను అభివృద్ధి చేసి సరుకు రవాణా ప్రారంభానికి కృషి చేసిన హైదరాబాద్ డివిజన్, కనస్ట్రక్షన్ విభాగం అధికారులు, సిబ్బంది బృందాన్ని అభినందించారు. దీంతో గజ్వేల్ చుట్టు పక్కల ప్రాంతాలు, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సరుకు రవాణా ప్రోత్సాహానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.