ఆ నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వాతావరణం..జనం బాట పట్టిన బాడా నాయకులు

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: ముందస్తు ప్రచార నేపథ్యంలో సంగారెడ్డి లో ఇప్పుడే ఎన్నికల latest telugu news..

Update: 2022-03-10 12:28 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: ముందస్తు ప్రచార నేపథ్యంలో సంగారెడ్డి లో ఇప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొన్నది. మున్సిపాలిటీల్లో నేతల పర్యటనలు మొదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు ఇండ్లు, ఆఫీసులకు పరిమితమైన నాయకులు కాలనీల బాట పట్టారు. ఓ లీడర్​ అమ్మ అంతా మంచిదేనా అంటూ కాలనీల్లో జనాన్ని పలకరిస్తూ వారి బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా మరొకరు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షలు జరుపుతూ రోడ్లపై డబ్బాల వద్ద మిర్చీ బజ్జీలు తింటూ హల్​చల్​ చేస్తున్నారు. పదుల సంఖ్యలో కార్యకర్తలను వెంటబెట్టుకుని నాయకులు తిరుగుతుండడంతో ఎన్నికలొస్తున్నాయా..? అంటూ జనం చర్చించుకుంటున్నారు. ఆ ఇద్దరు లీడర్లు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ​జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్​లు. వీరి రోజువారీ పర్యటనలతో సదాశివపేట, సంగారెడ్డి మున్నిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తున్నది.

చింతా ప్రభాకర్​ నగర బాట..

అధికార టీఆర్ఎస్ ​జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ నగర బాట పట్టారు. మొదటగా గత వారం నుంచి ఆయన సదాశివపేటలో వార్డుల వారీగా తిరుగుతూ.. జనంతో మమేకం అవుతున్నారు. ఏం అమ్మ ఎలా ఉన్నావు..? పింఛన్ ​వస్తుందా..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అంటూ పలకరిస్తూ తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రోజువారీగా వందకు పైగా నాయకులు, కార్యకర్తలను వెంట బెట్టుకుని ఎన్నికల ప్రచారం మాదిరిగానే తన వార్డులలో తిరుగుతున్నారు. ఇటీవల నారాయణఖేడ్​కు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, సదాశివపేట మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధుల విడుదల తో మున్సిపాలిటీల్లో సమస్యలు గుర్తించి పరిష్కరిస్తామని చెప్పి ప్రజల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.


సంగారెడ్డి కి కాంగ్రెస్​ నుంచి జగ్గారెడ్డి ఎమ్మెల్యే గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పనిలో పనిగా ఇక్కడ అభివృద్ధి అంతా సీఎం కేసీఆర్ ​చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడ జగ్గారెడ్డి ప్రమేయం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందని వారు ఉంటే వారి పేర్లు నమోదు చేసుకుని తప్పకుండా వచ్చేలా చూస్తామని హామీ ఇస్తున్నారు. సీఎం కేసీఆర్​ కోట్ల నిధులు ఇచ్చారని మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఆయా వార్డుల్లో పలువురి ఇండ్లలోకి వెళ్లి టీలు తాగుతూ, టిఫిన్‌లు చేస్తున్నారు. మీకు నేనున్నా అనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మంత్రి హరీష్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిలను తీసుకువస్తూ వారిచే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభింపజేయిస్తున్నారు ప్రభాకర్.

సమీక్షలు, సమావేశాల తో జగ్గారెడ్డి హల్​చల్

స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో హల్​చల్​చేస్తున్నారు. ఎప్పుడూ హైదరాబాద్​కే పరిమితం అయ్యే ఆయన ఈ మధ్య కాలంలో నియోజకవర్గం లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ తన ఇమేజ్​ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్​ మున్సిపాలిటీ లకు నిధులు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని అన్ని వార్డులకు సమానంగా ఇవ్వాలని ప్రెస్​ మీట్ పెట్టి హంగామా చేశారు. ఓ రోజు సదాశివపేట, మరో రోజు సంగారెడ్డి లో జనంతో సమావేశాలు పెట్టి వార్డులలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిధులు వచ్చాయని, వాటిని సమానంగా ఖర్చు చేసుకోవాలని ఆయన సూచించారు. అధికారులతో సమీక్షలు కూడా జరుపుతున్నారు. పనిలో పనిగా పట్టణంలో చిన్నపాటి దుకాణాలను ప్రారంభిస్తున్నారు.


గుళ్లు, మసీదులు, చర్చీలకు వెళుతూ ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. క్రీడాపోటీలకు వెళుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీధుల్లో తిరుగుతూ డబ్బా బండ్ల వద్ద మిర్చీ బజ్జీలు తింటూ, టీలు తాగుతూ స్థానిక ప్రజలతో కలిసి ముచ్చటిస్తున్నారు. సీఎం కేసీఆర్​ను తాను అడగడం తోనే సంగారెడ్డి కి మెడికల్​కళాశాల మంజూరు అయ్యిందని ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ లో ఉంటూనే ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడిపై ఒంటికాలిపై లేస్తూ జగ్గారెడ్డి టీఆర్​ఎస్ ​లో చేరనున్నారా..? అనే సందేహాలు కలిగేలా చేస్తూ స్థానిక ప్రజలను కన్ఫ్యూజ్ ​చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరి లో చర్చ జరిగేలా ఈ నెల 21న లక్ష మందితో భారీ బహిరంగ సభ పెట్టి తన సత్తా ఏమిటో చూపిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఇద్దరు నేతలు ఒకరికి మించి ఒకరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుండటంతో కార్యకర్తలలో కొత్త జోష్ కనిపిస్తున్నది.

Tags:    

Similar News