టీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్.. కేసీఆర్ ఉగ్రరూపం దాల్చేనా..?

వడ్ల కొనుగోళ్ల అంశంలో టీఆర్ఎస్ తదుపరి పోరాట వ్యూహమేంటి? మంత్రులు చెప్పిన ఉగ్రరూపం ఎలా ఉండబోతున్నది?

Update: 2022-04-02 01:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వడ్ల కొనుగోళ్ల అంశంలో టీఆర్ఎస్ తదుపరి పోరాట వ్యూహమేంటి? మంత్రులు చెప్పిన ఉగ్రరూపం ఎలా ఉండబోతున్నది? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన ఉద్యమం కంటే ఉధృతంగా ఉంటుందా? ఇవీ ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. ఉగాది పండుగ తర్వాత రైతుల్ని భాగస్వాముల్ని చేసి ఊహించని స్థాయిలో ఉద్యమం చేస్తామని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఢిల్లీకి వెళ్ళిన రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినా ప్రయోజనం లేకపోయిందని, తెలంగాణ పట్ల వివక్షగా వ్యవహరిస్తున్నదంటూ విమర్శలూ చేశారు. ఉగాది పండుక రానే వచ్చింది.. ఇప్పుడు ఉద్యమం ఎక్కడ మొదలవుతుంది.. ఎలా మొదలవుతుంది.. ఆ పోరాటం ఎలా ఉండబోతున్నది... ఇలాంటివన్నీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నది.

కేంద్రం మెడలు వంచే వరకు ఉద్యమం ఆగదంటూ మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్ రెడ్డి తదితరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉగాది తర్వాత స్వయంగా తానే వెళ్ళనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 21న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్లు వార్తలు వచ్చినా చివరి నిమిషాల్లో ఆయన ప్రోగ్రాం వాయిదా పడింది. పండగ తర్వాత వెళ్ళే అవకాశాలున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రులను, ప్రధానిని కూడా కలిసి ఈ విషయమై చర్చిస్తారని పేర్కొంటున్నారు. అక్కడ వెలువడే వైఖరికి అనుగుణంగా తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలోని బీజేపీ నేతలను పండగ తర్వాత కార్నర్ చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి నుంచి ఇంకా ఉద్యమం, పోరాటానికి సంబంధించి నిర్దిష్ట పిలుపు, ఆదేశాలు రాకపోయినప్పటికీ నల్లజెండాలను ఎగురవేయడం, బీజేపీ నేతల ఇళ్ళ ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం లాంటి కొన్ని ఆందోళనా రూపాలు దాదాపుగా ఖరారయ్యాయి. పార్టీ అధినేత నుంచి ఆదేశాల కోసమే ఇప్పుడు పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు షురూ కానున్నాయి. రైతులను కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం చేస్తామని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేసినందున రైతుబంధు సమన్వయ సమితుల బాధ్యులు రైతులను సమీకరించే పనిలో ఉన్నారు.

ఇప్పటికే కొన్నిచోట్ల వరి కోతలు మొదలయ్యాయి. త్వరలో మరికొన్ని ప్రాంతాల్లోనూ మొదలుకానున్నాయి. తదుపరి ఆందోళనలు, ఉద్యమరూపంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే సమయానికి రైతులు వరికోతల పనుల్లో బిజీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిర్వహించనున్న ఆందోళనల్లో రైతులు ఏ మేరకు పాల్గొంటారనే అనుమానాలు ఉన్నప్పటికీ వారిని భాగస్వాములను చేయడం ద్వారానే ఉద్యమం ఉధృతమవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రతీరోజు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు వడ్ల కొనుగోళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ట్వీట్ల ద్వారానూ సెటైర్లు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ నిర్వహించే ఉధృతమైన ఉద్యమం ఏ రూపంలో ఉంటుంది, దాని తీవ్రత ఎంత, క్షేత్రస్థాయిలో ఎలా నిర్వహించాలి తదితర పలు సందేహాలు ఇప్పుడు శ్రేణుల్ని వెంటాడుతున్నాయి. ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశంతోనే వారికి క్లారిటీ రానున్నది. ఆ పిలుపు కోసమే ఎదురుచూపులు మొదలయ్యాయి.

Tags:    

Similar News