ఉగాది వేడుకలకు దూరంగా కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేసిన గవర్నర్
దిశ, వెబ్‌డెస్క్: రాజ్‌భవన్‌లో నిర్వహించిన - Telangana Governor Tamilsai made key remarks during the Ugadi celebrations
దిశ, తెలంగాణ బ్యూరో: "ఒక రాష్ట్ర గవర్నర్‌గా నా పరిమితులు నాకు తెలుసు. ఆ ప్రకారమే విధులు నిర్వర్తిస్తాను. అందరితో సఖ్యతగా ఉండడమే తెలుసు. అహంభావం అసలే లేదు. ముఖ్యమంత్రికి కూడా ఉగాది వేడుకల ఆహ్వానం పంపాను. ఒక సోదరిగా భావించి వస్తారనే అనుకున్నాను. రాలేదు. గతంలో చాలా ఇన్విటేషన్లను ఇగ్నోర్ చేశారు. అయినా నేను బాధపడడంలేదు. నన్ను గౌరవించినవారిని నేనూ గౌరవిస్తాను. నన్ను గౌరవించకపోతే బాధపడను" అని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు.
రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన 'శుభకృత్' ఉగాది వేడుకల సందర్భంగా గవర్నర్ పై వ్యాఖ్యలు చేశారు. ప్రగతిభవన్‌లో జరిగే ఉగాది వేడుకలకు తనకు ఆహ్వానం అందలేదని, అందుకే వెళ్ళడంలేదన్నారు. ఒకవేళ అంది ఉంటే తప్పకుండా ఒక సోదరిగా వెళ్ళి ఉండేదాన్ని అని అన్నారు.
ఇప్పటివరకూ ప్రజల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే చొరవ తీసుకున్నానని, వచ్చే నెల నుంచి 'ప్రజా దర్బార్' నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఉగాది వేడుకలకు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహా మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, వివిధ పార్టీల నేతలకు ఆహ్వానాన్ని పంపినట్లు వివరించారు. పైస్థాయి, కింది స్థాయి అనే తేడా లేకుండా అందరికీ ఆహ్వానాలను పంపానని, ఎక్కడా ఎలాంటి తేడాలు ప్రదర్శించలేదన్నారు. ముఖ్యమంత్రి రావాలని కోరుకున్నానని, వస్తారనే భావించారని, ఏం పని ఉండి రాలేదో తనకు తెలియదన్నారు.
ఒక గవర్నర్‌గా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, కానీ అది ఇవ్వకపోయినా తానేమీ బాధపడలేదని, తెలంగాణ ప్రజల పట్ల అభిమానంతో అన్నింటినీ దిగమింగుకున్నానని అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కూడా తెలంగాణలో పాల్గొని ఆ వెంటనే పుదుచ్చరే లెఫ్టినెంట్ గవర్నర్‌గా అక్కడకూ వెళ్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించానని గుర్తుచేశారు. ఏ రాష్ట్ర గవర్నర్‌గా ఉంటే ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలని అన్నారు. అందరినీ గౌరవించడమే తనకు తెలుసునని అన్నారు.
పరిపాలనలో వ్యక్తులు ప్రధానం కాదని, ఎవరైనా 'సిస్టమ్'ను అనుసరించాలని అన్నారు. సమ్మక్క-సారలమ్మ ఉత్సవాలకు సైతం తనకు ప్రోటోకాల్ లభించలేదని, అయినా బాధపడలేదని, బాధపడే వ్యక్తిని కూడా కాదన్నారు. ప్రజల అఫెక్షన్ ముందు ఇవేవీ పెద్ద అంశాలు కాదన్నారు. ఒక గవర్నర్‌గా రాజ్యాంగపరమైన విధులు, విశ్వవిద్యాలయాల కాన్వొకేషన్లు లాంటివాటికి, ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సిన పనుల విషయంలో ఎక్కడా నిర్లక్ష్య ధోరణి లేదన్నారు.
కేసీఆర్‌తో గ్యాప్ ఉండాలని కోరుకోలేదు
సీఎం కేసీఆర్‌తో, ప్రగతి భవన్‌తో గ్యాప్ ఏర్పడాలని తాను కోరుకోలేదని, గ్యాప్ ఏర్పడిందనే మాటలు మాత్రం వినిపిస్తున్నాయని తమిళిసై పేర్కొన్నారు. తన వైపు నుంచి గ్యాప్ పెరిగేలా ఎలాంటి చర్యలూ చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. అభిప్రాయ భేదాలు ఉండడం సహజమేనని, అది ప్రత్యేకమైనదేదీ కాదని అన్నారు. గతంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపానని, కానీ వాటిని ఇగ్నోర్ చేశారని, దీంతో గ్యాప్ ఏర్పడిందేమోననే భావన తనకూ కలుగుతున్నదన్నారు.
తాను కాంట్రొవర్సీ వ్యక్తిని కాదని, కన్‌స్ట్రక్టివ్ వ్యక్తిని మాత్రమేనని నొక్కిచెప్పారు. సీఎంతో గ్యాప్ ఉందా అని పాత్రికేయులు అడిగితే తన వైప నుంచి వచ్చే ఒక్క సమాధానంతోనే స్పష్టత రాదని, రెండో వైపు నుంచి కూడా ఏం వినిపిస్తుందో తెలుసుకుని తర్వాత క్లారిటీకి రావొచ్చని అన్నారు. తనకు తెలిసినంత వరకు ఫ్రెండ్లీ గవర్నర్‌గానే ఉంటున్నానని, ఈగోలు తనకు తెలియవన్నారు.