బేరసారాలు షూరు .. నచ్చిన జిల్లాకు రావాలంటే 20 లక్షలు..!

దిశ ప్రతినిధి, సిద్దిపేట: తల్లిదండ్రుల తర్వాత మనం ప్రాధాన్యమిచ్చే స్థానం గురువు.- latest Telugu news

Update: 2022-03-07 17:07 GMT

దిశ ప్రతినిధి, సిద్దిపేట: తల్లిదండ్రుల తర్వాత మనం ప్రాధాన్యమిచ్చే స్థానం గురువు. ఇప్పటి వరకు మనం అన్ని రంగాల్లో లంచం అనే మాట విన్నాం ఒక్క ఉపాధ్యాయ వృత్తిలో తప్ప. అంతటి ప్రాధాన్యం కల్గిన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న టీచర్లు కొందరు వక్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నెమ్మదిగా రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగా ఉపాధ్యాయులకు లంచం అనే మరక అంటింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 317 ఉపాధ్యాయులను అలా మార్చేసింది. ఉపాధ్యాయులు ఇద్దరు పరస్పర అంగీకారంతో బదిలీ కావొచ్చనే ప్రభుత్వ ఆదేశాల మేరకు పలువురు బదిలీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అలా అని స్నేహపూర్వకంగా కాదండోయ్ .. దానికి ఓ రేటు కట్టారు. దూరాన్ని బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇది చూసిన తోటి ఉపాధ్యాయులు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూపులు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.

స్వంత జిల్లాకు వచ్చేందుకు టీచర్ల ఇబ్బందులు..

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో చాలా మంది ఉపాధ్యాయులకు తీరని నష్టం కల్గించింది. స్వంత జిల్లాకు బదిలీ కాకపోగా చాలా మంది ప్రస్తుతం ఉంటున్న పాఠశాలకు చాలా దూరంలో వెళ్లారు. ఉదాహరణకు సిద్దిపేటకు చెందిన కొందరు ఉపాధ్యాయులు బదిలీలకు ముందు మెదక్ జిల్లాలో పనిచేస్తుండగా.. 317 జీవోతో సిద్దిపేటకు రావాల్సింది పోయి.. సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, పలుమార్లు ధర్నాలు, నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులను శాంతింపజేసేందుకు పరస్పర బదిలీలకు అవకాశం కల్పించింది. ఈ నెల 15 వరకు గడువు ఇవ్వడంతో చాలా మంది ఉపాధ్యాయులు తమ స్వంత జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

పరస్పరంకు పైసలు..

పరస్పర బదిలీల ప్రక్రియకు గడువు సమీపిస్తుండటంతో కొంత మంది ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయుల నుండి పైసలు డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంటు దగ్గరగా ఉన్న వారు.. అర్బన్ పాఠశాలల్లో పనిచేయడం ఇష్టం లేనివారు, ప్రమోషన్ పొందుతామని తెలిసిన వారు, మరికొందరు ఆర్ధిక ఇబ్బందులతో బదిలీలకు ఒప్పుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసం వాట్సాప్, టెలిగ్రాంలో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి తాము సంగారెడ్డికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం.. మీరు సిద్దిపేటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. ఇది చూసిన ఉపాధ్యాయులు తమ స్వంత జిల్లాకు వచ్చేందుకు ఫోన్ చేసి అడగ్గా వారి నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి నుండి మెదక్ జిల్లాకు వచ్చేందుకు రూ.10-15 లక్షలు డిమాండ్ చేస్తుండగా.. సంగారెడ్డి నుండి సిద్దిపేటకు రావాలంటే మాత్రం రూ.20 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ బాగోతం బహిర్గతం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులే నేరుగా డబ్బులు అడగకుండా మధ్యవర్తులను నియమించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయం జిల్లా విద్యాశాఖ అధికారుల వద్దకు చేరిన దీనిపై స్పందించకపోవడంపై పలువురు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల తీరుతో ఉపాధ్యాయ వృత్తికే కలంకం ఏర్పడుతుందని.. లంచం డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News