అసెంబ్లీలో తాళిబొట్లతో టీడీపీ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన

దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా - TDP MLAs innovative protest in the Assembly

Update: 2022-03-25 11:14 GMT

దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. సభలో విజిల్స్ వేయడం, చిడతలు వాయిస్తూ స్పీకర్ తీరు, వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం కూడా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాళిబొట్లతో నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాళిబొట్లతో నిరసన తెలిపారు. నాటు సారా, కల్తీసారాలతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని టీడీపీ శాసన సభాపక్షం ఆరోపించింది. అనంతరం శాసన మండలి, శాసన సభకు ర్యాలీగా వెళ్లారు.

చివరి రోజూ రచ్చే..


అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కూడా టీడీపీ నిరసనలతో శాసనసభ అట్టుడికింది. జంగారెడ్డి గూడెం మరణాలతో పాటు కల్తీసారా, కల్తీ మద్యంపై చర్చించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే వైసీపీ సభ్యులు మాత్రం బడ్జెట్‌పై చర్చిండం మెుదలు పెట్టారు. దీంతో సభను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. సభలోకి తెచ్చిన తాళిబొట్లతో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలోనే టీడీపీ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.


అంతకుముందు అసెంబ్లీకి కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు తాళిబొట్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. మద్య నిషేధం పై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా' అంటూ సమావేశాల చివరి రోజూ నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభా పక్షం నిరసనకు దిగింది. మహిళల తాళిబొట్లు తెంచారంటూ తాళిబొట్లు చేతపట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీ నిర్వహించారు. మద్యపాన నిషేధం అని మహిళల మెడలో తాళిబొట్లు తెంచుతున్నారంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News