Rajat Kumar IAS: రజత్‌కుమార్‌పై చర్యలు తీసుకోండి.. సీఎస్‌కు డీవోపీటీ లేఖ
రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు డీవోపీటీ శాఖ లేఖ రాసింది. కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ ఫిబ్రవరి 2వ తేదీన ప్రధానికి లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదుపై డీవోపీటీ స్పందించి గత నెల 31న సీఎస్‌కు లేఖ రాసింది. సాగునీటిపారుదల శాఖకు కార్యదర్శిగా ఉన్న రజత్ కుమార్ తన కుమార్తె వివాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ నుంచి ప్రత్యక్షంగా ఆర్థిక సహకారం పొందారని, ఫలక్‌నుమా లగ్జరీ ప్యాలెస్ మొదలు పలు హోటళ్ళలో ఐదు రోజుల పాటు అతిథుల కోసం వసతి సౌకర్యాలను పొందారని ఆ ఫిర్యాదులో బక్క జడ్సన్ పేర్కొన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా దాన్ని కూకటివేళ్ళతో పెకిలించాల్సిందిగా జనవరి 31నాటి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రజలకు పిలుపునిచ్చారని, ఆ వెలుగులో ఇప్పుడు ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ వ్యవహారంలోనూ కార్యాచరణ చేపట్టాలని ఫిర్యాదులో ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన ప్రధాని కార్యాలయం తదుపరి కార్యాచరణ కోసం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖకు పంపింది. దాన్ని పరిశీలించిన డీవోపీటీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. గతంలోనూ ఇదే విషయమై అందిన రెండు వేర్వేరు ఫిర్యాదులపై డీవోపీటీ ఇదే తరహా లేఖలను రాసింది. కానీ ఇప్పటి వరకూ చర్యలు లేవు. ఈ నేపథ్యంలో బక్క జడ్సన్ ఫిర్యాదుపైనా స్పందించి మార్చి 31న సీఎస్‌కు లేఖ రాయడం గమనార్హం.