Azerbaijan Plane Crash : అజర్‌బైజన్ విమాన ప్రమాదం రష్యా పనే..?

అజర్‌బైజన్ ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదానికి రష్యా దాడులే కారణమని కొంత మంది నిపుణులు అభిప్రాయపడ్డారు.

Update: 2024-12-26 16:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అజర్‌బైజన్ ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదానికి రష్యా దాడులే కారణమని కొంత మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా గురువారం పలు కథనాలు వెలువరించాయి. క్రిస్ట్‌మస్ రోజు విమానం కజకిస్తాన్‌లోని అక్వావ్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్, యూరో న్యూస్ వంటి విదేశీ మీడియా మాత్రం విమానంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని వెల్లడించాయి. క్షిపణులతో దాడి చేయడంతో విమానం కూలినట్లు తెలిపాయి.

క్షిపణి లేదా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఫైర్‌తో దాడి

అజర్ బైజన్ బాకు నగరం నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా రష్యా ఉపరితలం నుంచి క్షిపణి లేదా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఫైర్ కారణంగా విమానం కూలి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. కీవ్‌కు చెందిన డ్రోన్‌గా రష్యా భావించడం వల్లే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విమానాన్ని కూల్చివేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై కజకిస్తాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించగా ఎలాంటి ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. విమాన శిథిలాలలో రంధ్రాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ దాడులతోనే ఏర్పడినట్లు రష్యా మిలిటరీకి చెందిన బ్లాగర్ యురి పొడొల్యాకా తెలిపాడు. ప్రమాదవశాత్తు రష్యా వాయు క్షిపణి వ్యవస్థ విమానాన్ని ఢీకొట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఫైర్ కారణంగానే విమానం కూలినట్లుగా పరిస్థితులు ఉన్నాయని ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ అధికారి మ్యాట్ బోరీ తెలిపాడు.  

Tags:    

Similar News