అక్ర‌మ వ్యాపారులపై నిఘా... మానుకోట ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్‌

Update: 2022-02-11 11:23 GMT

దిశ‌, మ‌రిపెడ‌ : జిల్లా వ్యాప్తంగా అక్ర‌మ వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టామని, అక్ర‌మ వ్యాపారాలు మానుకోవాల‌ని ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ హెచ్చ‌రించారు. శుక్ర‌వారం ఆయ‌న మ‌రిపెడ పోలీస్‌స్టేష‌న్‌లో మ‌రిపెడ‌, చిన్న‌గూడూర్‌, సీరోల్ పీఎస్‌ల ప‌రిధిలో ప‌ట్టుబ‌డిన న‌ల్ల‌బెల్లం, ప‌టిక, సారాయిలకు సంబంధించిన కేసు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం మ‌రిపెడ ఎస్ఐ ప్ర‌వీణ్ కుమార్ త‌న బృందంతో బుర‌హాన్‌పురం, తానంచ‌ర్ల‌, ల‌చ్య‌తండా శివారుల్లో వాహ‌న త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా రెండు ట్రాలీల్లో సుమారు 80క్వింటాళ్ల న‌ల్ల‌బెల్లం, 5క్వింటాళ్ల ప‌టిక‌, 15లీట‌ర్ల నాటు సార ప‌ట్టుబ‌డిందన్నారు. వీటి విలువ సుమారు రూ.8.15ల‌క్ష‌లు ఉంటుంద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.

అదే విధంగా సీరోల్ పీఎస్ ప‌రిధిలోని కందికొండ స్టేజీ వ‌ద్ద ఎస్ఐ లావూడ్య న‌రేశ్ త‌న బృందంతో వాహ‌న త‌నిఖీలు చేస్తుండగా.. ఓ ట్రాలీలో 15క్వింటాళ్ల న‌ల్ల‌బెల్లం, 1 క్వింటా ప‌టిక, 5లీట‌ర్ల గుడుంబా ఉన్న‌ట్లు గుర్తించి, వాహ‌నం స్వాధీనం చేసుకొని న‌లుగురిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.1.51ల‌క్ష‌లు ఉంటుంద‌న్నారు. మ‌రో ఘ‌ట‌న‌లో చిన్న‌గూడూర్ ఎస్ఐ విజ‌య్ రామ్ కుమార్ త‌న ప‌రిధిలోని జ‌య్యారం క్రాస్ రోడ్డు వ‌ద్ద వాహ‌న త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా ట్రాలీలో 30క్వింటాళ్ల న‌ల్ల‌బెల్లం, క్వింటా ప‌టిక, 5 లీట‌ర్ల నాటు సారాయిని గుర్తించి.. వెంట‌నే వాహ‌నాన్ని స్వాధీనం చేసుకొని న‌లుగురిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. బెల్లం ప‌ట్టివేత‌లో మొత్తం 11 మందిపై కేసు న‌మోదు కాగా.. ఆరుగురు నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే వారిని అరెస్టు చేస్తామ‌ని చెప్పారు.

ఇందులో సూర్యాపేట జిల్లా నూత‌న్‌క‌ల్ మండలం కొత్త‌తండాకు చెందిన బానోత్ శ్రీ‌ను, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ఆలేరు మండ‌లం గుండ్ల‌గూడానికి చెందిన గుగులోత్ ప్ర‌శాంత్‌, జ‌న‌గామ జిల్లా న‌ర్మెట్ట మండ‌లం ఇప్ప‌ల‌గ‌డ్డ తండాకు చెందిన బానోత్ కుమార్‌, మ‌రిపెడ మండ‌లం ల‌చ్య తండాకు చెందిన గుగులోత్ న‌వీన్‌, చిన్న‌గూడూర్ మండ‌లం ప‌గిడిపెళ్లి గ్రామానికి చెందిన ధ‌రావ‌త్ కృష్ణ ప‌ట్టుబ‌డినట్లు చెప్పారు. మానుకోట జిల్లా గూడూర్ మండ‌లం పొనుగోడు గ్రామానికి చెందిన బానోత్ కృష్ణా, బానోత్ మోహ‌న్‌, జ‌న‌గాం జిల్లా పాల‌కుర్తి మండ‌లం మ‌ల్లంప‌ల్లి గ్రామానికి చెందిన గుగులోత్ మున్నా, న‌ర్సింహుల‌పేట మండ‌లం గోల్ తండాకు చెందిన ర‌మేశ్, చిన్న‌గూడూర్ మండ‌లం చిన్నాతండాకు చెందిన గుగులోత్ న‌రేశ్, గుగులోత్ శ‌ర‌త్ ప‌రారీలో ఉన్న‌ట్లు వెల్లడించారు. వీరంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్ చిత్తూర్ జిల్లా నుంచి ఈ న‌ల్ల‌బెల్లాన్ని విక్ర‌యించి జిల్లాలోని రూర‌ల్ ప్రాంతాల్లో నాటు సారాయి త‌యారీ దారుల‌కు విక్ర‌యిస్తున్న‌ట్లు తెలిపారు.

అనంతరం నిషేధిత ప‌దార్థాల ర‌వాణాను చాక‌చ‌క్యంగా అడ్డుకున్న మ‌రిపెడ ఎస్ఐ పిట్ల ప్ర‌వీన్ కుమార్, సీరోల్ ఎస్ఐ లావూడ్య న‌రేశ్, చిన్న‌గూడూర్ ఎస్ఐ విజ‌య్ రామ్‌, మరిపెడ ఏఎస్ఐ సాంబారావు, పీసీల‌కు ఎస్పీ రివార్డులు అందించి, అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో తొర్రుర్ డీఎస్పీ వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి, సీఐ సాగ‌ర్‌, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News