మండలంగా మారిన గట్టుప్పల... ఇదంతా ఉప ఎన్నిక మహత్యమేనా...?
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసి దాదాపు...Special Story of Gattuppal
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసి దాదాపు ఐదేండ్లు పూర్తయ్యింది. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని గట్టుప్పలను సైతం కొత్త మండలంగా ప్రకటించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. పలు రాజకీయ కారణాల నేపథ్యంలో ఆ డిమాండ్ నెరవేరలేదు. దీంతో ఏండ్లపాటు గట్టుప్పల మండలం కోసం నిర్విరామంగా గ్రామస్తులు, స్థానికులు పెద్దఎత్తున దీక్షలు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో గట్టుప్పల మండల డిమాండ్ అలాగే ఉండిపోయింది. అయితే తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఉపఎన్నిక వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టుప్పల మండల ఏర్పాటుకు పూనుకుందని తెలుస్తోంది. అందుకు సంబంధించి 'దిశ' ముందుగానే కథనాన్ని ప్రచురించింది. తాజాగా శనివారం గట్టుప్పల మండల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
9 గ్రామాలతో గట్టుప్పల మండలం ఏర్పాటు..
గట్టుప్పల మండలాన్ని 9 గ్రామ పంచాయతీలతో కలిపి మండలంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామాలను చండూరు, మర్రిగూడ, మునుగోడు మండలాలను నుంచి తీసుకుంటున్నారు. చండూరు మండలంలోని గట్టుప్పల, తేరట్‌పల్లి, కుమ్మందనిగూడ, షిర్డిపల్లి, కొండాపురం, మర్రిగూడ మండలంలోని అంతంపేట, సోమ్రాజుగూడ, నామాపురం, మునుగోడు మండలంలోని వెల్మకన్నె గ్రామాలను కలిపి గట్టుప్పల మండలంగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మండల ఏర్పాటు, ప్రతిపాదిత గ్రామాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. 15 రోజుల్లోపు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావొచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇదిలావుంటే.. గట్టుప్పల మండల ఏర్పాటుతో స్థానికులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.