ఉక్రెయిన్‌లో బంకర్‌లో కుమారుడు.. ఆందోళనలో తల్లిదండ్రులు

Update: 2022-03-01 16:24 GMT

దిశ, నాచారం: ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్ దేశానికి వెళ్ళిన విద్యార్థులు అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. మరోవైపు తమ పిల్లలు ఎలా బయటపడి క్షేమంగా వస్తారని ఆందోళనకు గురవుతున్నారు. టీవీల ముందు ప్రత్యక్ష ప్రసారాలు ఫోన్‌ల ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. తమ పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. మల్లాపూర్ సూర్య నగర్ చెందిన కటారు శ్రీనివాస్ గౌడ్ కుమారుడు దుర్గా భాస్కర్(20) ఉన్నత విద్యలో భాగంగా ఇటీవలే ఎంబిబిఎస్ చదువు కోసం డిసెంబర్11 ఉక్రెయిన్ దేశానికి వెళ్ళాడు.

క్వార్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. దేశంలో ఏర్పడినటువంటి పరిస్థితులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రష్యా దాడితో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అనుక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. క్వార్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో దుర్గా ప్రసాద్ కూడా అక్కడే ఉన్నాడు. వీరంతా రష్యా దాడిలో ప్రాణాలు కాపాడుకోవడం కోసం నాలుగు రోజులు బంకర్‌లో తలదాచుకున్నారు.

మంగళవారం స్వదేశానికి తిరిగి రావడానికి అక్కడి ప్రభుత్వం రైళ్ళను సిద్ధం చేసింది. రైలు మార్గం ద్వారా హంగేరి తరలిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దుర్గాప్రసాద్ తమ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపారు. ఫోన్ సిగ్నల్ ద్వారా రష్యా దాడులకు పాల్పడుతోంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఫోన్‌లు కూడా ఫ్లైట్ మోడ్ లో ఉంచుతున్నారు. హంగేరి నుంచి విమానం ద్వారా తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

క్షేమంగా రావాలని కోరుకుంటున్నా.. శ్రీనివాస్ గౌడ్ దుర్గాప్రసాద్ తండ్రి

తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు దుర్గాప్రసాద్ తండ్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకొని అందరిని క్షేమంగా తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో తమ కుమారుడు చదువు అగమ్యగోచరంగా తయారవుతుందని అని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News