'కేంద్ర ప్రభుత్వం కుట్ర.. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ దిశగా అడుగులు'
దిశ, రామగిరి: సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతేడాది డిసెంబర్‌లో 3రోజుల సమ్మె చేపట్టి బొగ్గుబావుల వేలంపాటకు
దిశ, రామగిరి: సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతేడాది డిసెంబర్‌లో 3రోజుల సమ్మె చేపట్టి బొగ్గుబావుల వేలంపాటకు ప్రైవేటు కాంట్రాక్టర్లు ముందుకు రాకుండా ఆపగలిగాము. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొత్తగా నాలుగు కోడ్‌లను అమలు చేయాలని చూస్తుందని, కోడ్‌లు అమలైతే కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఏఐటీయూసీ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ వైవీ రావు తెలిపారు. శనివారం ఆర్జీ3 ఏరియా ఓసీ1 లో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి, ఆర్జీ3 బ్రాంచ్ సెక్రటరీ దొమ్మటి కొమురయ్య, ఏఐటీయూసీ ఆర్జీ3 బ్రాంచ్ సెక్రటరీ జూపాక రాంచందర్, ఐఎన్టీయూసీ ఓసీ1 పిట్ సెక్రటరీ తిరుపతి, ఆర్జీ3 హెచ్ఎంఎస్ నాయకుడు ఎండీ ఇస్మాయిల్ హాజరయ్యారు. రాజారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 6లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను అమ్మాలనే కుట్రలో భాగంగా 32వేల కోట్ల విలువచేసే బొగ్గు బావులను అమ్మాలని నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో బొగ్గు బావుల ద్వారా లాభాలు లేకపోవడంతో ఒక్క కోయగూడెం గనిని మాత్రమే తీసుకోవడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. ఇంతకుముందు దేశవ్యాప్త సమ్మెలో రైతుల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలు వేరు వేరుగా పాల్గొన్నాయని, ఈ సమ్మెలో అన్ని సంస్థలు ఒకే తాటిపై వచ్చి 28, 29 తేదిలలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.