తిరిగి లాభాలను దక్కించుకున్న స్టాక్ మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి మెరుగైన లాభాలను దక్కించుకున్నాయి. సోమవారం నాటి latest telugu news..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి మెరుగైన లాభాలను దక్కించుకున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత ఒడిదుడుకుల మధ్య మొదలైన సూచీలు పుంజుకున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ పలు కీలక పరిణామాలు స్టాక్ మార్కెట్లకు మద్దతిచ్చాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడటం కూడా దేశీయంగా మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచింది. ఉదయం ప్రారంభమైన సమయంలో చమురు ధరల పెరుగుదల, అమెరికాలో వడ్డీ రేట్ల వల్ల స్వల్ప నష్టాలను చూశాయి.
ఇక, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో సభ్యత్వానికి వెళ్లే ఆసక్తి లేదని చెప్పడం మార్కెట్లకు కలిసొచ్చింది. దీనికితోడు దేశీయంగా భారత ఆర్థికవ్యవస్థ మెరుగ్గానే ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగ పరిస్థితి మనకు ఉండదని, యుద్ధ ప్రభావం కూడా తక్కువగానే ఉంటుంది, ప్రస్తుతం ఎక్కువగా ఉన్న ధరలు త్వరలో దిగొస్తాయన్నారు. ఈ పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది. మిడ్-సెషన్‌కు ముందు నుంచి సూచీలు అధిక లాభాల వద్దే ట్రేడయింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 696.81 పాయింట్లు ఎగసి 57,989 వద్ద, నిఫ్టీ 197.90 పాయింట్లు పెరిగి 17,315 వద్ద ముగిశాయి.
\నిఫ్టీ లో ఐటీ, ఆటో రంగాలు 1 శాతానికి పైగా పుంజుకోగా, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్వల్పంగా నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లు పుంజుకున్నాయి. ముఖ్యంగా టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, ఐటీసీ, టీసీఎస్, కోటక్ బ్యాంక్ అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.18 వద్ద ఉంది. మంగళవారం ట్రేడింగ్‌లో దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ 2.3 శాతం మేర లాభపడటం స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. గడిచిన వారం రోజుల్లో కంపెనీ షేర్ ధర 7 శాతం పెరగడం గమనార్హం.