Stock Market: భారీ లాభాలు సాధించిన సూచీలు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీగా లాభాలతో పుంజుకున్నాయి..latest telugu news
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీగా లాభాలతో పుంజుకున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఉదయం నుంచే అధిక లాభాలతో ర్యాలీ ప్రారంభించగా, ప్రధానంగా దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ల విలీన వార్తతో సూచీల్లో ఉత్సాహం పెరిగింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ వార్తలతో మదుపర్లలో సెంటిమెంట్ బలపడింది.
నిఫ్టీ50లో ప్రధాన వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ 10 శాతం ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లలో జోరు పెరిగింది. మరోవైపు భారత ఎగుమతులు రికార్డు స్థాయిలో నమోదవడం కూడా ఇన్వెస్టర్లలో జోష్‌ను పెంచింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి దేశీయ ఎగుమతులు ఏకంగా రూ. 31.5 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 12 శాతానికి పైగా క్షీణించి, బ్రెంట్ బ్యారెల్ ధర 103 డాలర్లకు తగ్గింది. వీటికితోడు కీలక రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో దాదాపు అన్ని రంగాలు లాభాలను చూశాయి. ఈ నేపథ్యంలో ప్రారంభం నుంచే అధిక లాభాలను కొనసాగించడంతో సెన్సెక్స్ ఇండెక్స్ చాలా రోజుల తర్వాత 60 వేల మార్కును, నిఫ్టీ 18 వేల మార్కును అధిగమించాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,335.05 పాయింట్లు ఎగసి 60,611 వద్ద, నిఫ్టీ 382.95 పాయింట్లు పుంజుకుని 18,053 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు 4-5 శాతం మధ్య పెరిగాయి. మిగిలిన రంగాలు సైతం 1 శాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలను ఎదుర్కొనగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ దాదాపు 10 శాతం పెరగ్గా, కోటక్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్ అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.52 వద్ద ఉంది.