Stock Market: వరుస లాభాల తర్వాత నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది...telugu latest news

Update: 2022-04-05 10:54 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. గత కొన్ని సెషన్లలో మెరుగైన ర్యాలీ చూసిన మదుపర్లు కీలక కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. మంగళవారం నాడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.44 శాతం పెరిగి 109 డాలర్లకు పైగా చేరుకుంది. ఈ ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో సూచీలు నెమ్మదించాయి. దేశీయంగా స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం నుంచే ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. దేశీయంగా లాభాల స్వీకరణకు తోడు గ్లోబల్ మార్కెట్లు నీరసించడంతో నష్టాలను ఎదుర్కొన్నాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 435.24 పాయింట్లు పతనమై 60,176 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయి 17,957 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు 1 శాతానికి పైగా పడిపోయాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఐటీసీ, టైటాన్, టీసీఎస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల షేర్లు అధిక నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.29 వద్ద ఉంది.

Tags:    

Similar News