స్టాక్ మార్కెట్ల 'క్రాష్'!

Update: 2022-02-14 12:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు 'బ్లడ్‌బాత్' సృష్టించాయి. సోమవారం ట్రేడింగ్‌లో దలాల్ స్ట్రీట్ భారీగా కుదేలైంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు పతనం కావడంతో ఆ ప్రభావం సూచీలపై పడింది. దేశీయంగా అన్ని రంగాల్లోను అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 1,700 పాయింట్లు, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. 2022 లో సూచీలు ఈ స్థాయిలో దెబ్బతినడం ఇదే మొదటిసారి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,747.08 పాయింట్లు క్షీణించి 56,405 వద్ద, నిఫ్టీ 531.95 పాయింట్లు పడిపోయి 16,842 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మెటల్, ఫైనాన్స్, మీడియా, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు అత్యధికంగా 4-6 శాతం మధ్య కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్ షేర్ మాత్రమే 1 శాతం లాభంతో రాణించింది. మిగిలిన అన్ని షేర్లు పడిపోయాయి. ముఖ్యంగా టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, మారుతీ సుజుకి, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో షేర్లు 3.5-6 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.58 వద్ద ఉంది.

రూ. ఎనిమిదిన్నర లక్షల కోట్లు స్వాహా..

దేశీయ స్టాక్ మార్కెట్లో అమ్మకాల వెల్లువ నెలకొనడంతో సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 8.5 లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. గత రెండు సెషన్ల పతనం కారణంగా పెట్టుబడిదారులు రూ. 12.45 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో మదుపరుల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 255.42 లక్షల కోట్లకు పడిపోయింది.

Tags:    

Similar News