వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేశారు

Update: 2024-12-23 08:55 GMT

దిశ, సంగారెడ్డి : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ… జిల్లా పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం, జన్నారం గ్రామానికి చెందిన ముద్దంగి భీమేష్ హైదరాబాద్ లోని నాంపల్లి లేబర్ అడ్డాలో నివసిస్తూ కులీ పని చేస్తూ జీవనం సాగించేవారని తెలిపారు. కాగా నిందితుడు గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిదిలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేసుకొని రాత్రి నేరాలకు పాల్పడుతూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తూ జెల్సాలు చేస్తున్నాడన్నారు.

ఇదే క్రమంలో అతడు మార్చి నెలలో రామచంద్రపురం పోలీసు స్టేషన్ పరిధిలోని రెండు ఇళ్ళలో, అక్టోబర్ నెలలో హయత్ నగర్ పీఎస్ రాచకొండ కమిషనరేట్ పరిదిలోని రెండు ఇళ్ళలో, నవంబర్ నెలలో అమీన్ పూర్ పీఎస్ పరిదిలోని ఏడు ఇళ్ళలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ బంగారు వెండి ఆభరణాలు, నగదు చోరీ చేయడం జరిగిందన్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో అమీన్ పూర్, బీఎస్ఆర్ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు గత కొంత కాలంగా రాత్రి పూట ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నాడని వివరించారు.

అతనిపై మొత్తం 30 కేసులు ఉన్నాయని, గతంలో జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో 5, షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో 8, దుండిగల్ పోలీస్ స్టేషన్ లో 4, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో 1, మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 1, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో 1, ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో 4, ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ లో 3, హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ లో 1, నాంపల్లి పోలీస్ స్టేషన్ లో 1, అబ్దుల్లా పూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో 1, మొత్తం 30 కేసులు ఉన్నాయని తెలిపారు. అదే మరో 11 కేసులు ఇతర జిల్లాలో ఉన్నాయని మొత్తం 41 కేసులు ఉన్నాయన్నారు. నిందితుడిపై పీడీ యాక్టు పెడతామని వివరించారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర..

సీసీ కెమెరాల వల్ల నేరాలు అరికట్టడంలో కీలకపాత్ర పోషించడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ప్రజలు అందరూ తమ తమ కాలనీ, నివాస సముదాయాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. అదే విధంగా విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరుచుకోవాల్సిందిగా, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జిల్లాలో జరుపుకోవాలన్నారు. వేడుకలకు సినీ సెలబ్రిటీలు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

అదే కాకుండా ఫాం హౌజ్ ల్లో వేడుకలు నిర్వహించాలన్నా, మందు, డ్రగ్స్ తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజలు కొత్త సంవత్సర వేడుకలు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో పటాన్ చెర్వు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్ పూర్ ఇన్స్ పెక్టర్ సదా నాగరాజు, సీసీఎస్ ఇన్స్ పెక్టర్ శివ కుమార్, సీసీఎస్ ఎస్.ఐ. శ్రీకాంత్, అమీన్ పూర్ ఎస్.ఐ. విజయ్ రావ్, హెడ్ కానిస్టేబుల్ రేక్యా, కానిస్టేబుళ్లు అన్వర్, శశి, సలీం, ప్రశాంత్, ప్రేం సింగ్ , సీసీఎస్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News