భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు !
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నాయి...telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతుండటంతో పాటు దేశీయంగా స్టాక్ మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉండటం మదుపర్లలో ఆందోళనను పెంచింది. ముడి చమురు ధరలు రికార్డు గరిష్ఠాలను నమోదు చేస్తుండటం కూడా మదుపర్లను ఒత్తిడికి గురి చేస్తోంది. చమురు ధరలు అధికం కావడం వల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని, భారత్ అవసరానికి మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ పెరుగుదల వల్ల భారత వాణిజ్యం, కరెంట్ ఖాతా లోటును పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,491.06 పాయింట్లు కుప్పకూలి 52,842 వద్ద, నిఫ్టీ 382.20 పాయింట్లు పతనమై 15,863 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ మాత్రమే లాభాలతో రాణించగా, రియాల్టీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు 3-6 శాతం మధ్య నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీ, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, ఆల్ట్రా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, హిందూస్తాన్ యూనిలీవర్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 4-8 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి.
ఒక్కరోజే రూ. 6.28 లక్షల కోట్లు ఆవిరి..
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కారణంగా ఇన్వెస్టర్ల ఆందోళనలు పెరిగిపోతుండటంతో స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మదుపర్ల సంపద సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూ. 6.28 లక్షల కోట్లు క్షీణించింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 246.85 లక్షల నుంచి రూ. 240.57 లక్షలకు పడిపోయింది. గత నెలలో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగ రూ. 29 లక్షల కోట్లు పోయాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.