ఢిల్లీకి జగ్గారెడ్డి.. ఫోన్ చేసిన సెక్రెటరీలు

దిశ ప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్​ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం.. Latest Telugu News..

Update: 2022-04-01 09:59 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్​ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం నుంచి పిలువు వచ్చింది. ఏఐసీసీ సెక్రెటరీలు బోసురాజు, శ్రీనివాసన్​లు వేర్వేరుగా జగ్గారెడ్డికి ఫోన్లు చేశారు. బోసురాజు మెదక్​ పార్లమెంట్​ ఇన్‌చార్జిగా, శ్రీనివాసన్​ జహీరాబాద్​ పార్లమెంట్​ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యువనేత రాహుల్​ గాంధీతో కలిసి మాట్లాడేందుకు అపాయింట్​మెంట్​ లభించిందని వీరిద్దరు జగ్గారెడ్డితో చెప్పారు. సోమవారం సాయంత్రానికి ఢిల్లీకి రావాలని సమాచారం అందించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం జగ్గారెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీరును జగ్గారెడ్డి తప్పుబడుతూ వస్తున్నారు. సీనియర్లమైన తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుబట్టారు.

ఈ క్రమంలోనే పీసీసీ సమావేశాలకు కూడా హాజరు కాలేకపోయారు. మెదక్​ జిల్లాలో తనకు సమాచారం లేకుండా పలు కార్యక్రమాలు నిర్వహించడాన్ని జగ్గారెడ్డి సీరియస్​గా తీసుకున్నారు. రేవంత్​రెడ్డిది కలుపుకుపోయే స్వభావం కాదని, ఆయన తీరు నచ్చలేదని పలుమార్లు మీడియా ఎదుట విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే జగ్గారెడ్డిని పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించింది. దీనితో ఆగ్రహించిన ఆయన మరోసారి రేవంత్​పై ఫైర్​ అయ్యారు. సోనియా గాంధీని తిట్టిన వారికి పదవులు ఇచ్చి.. మాలాంటి వారి పదవులు తీసేస్తారా..? అంటూ మండిపడ్డారు. దీనితో జగ్గారెడ్డిపై అధిష్టానం మరింత సీరియస్​గా వ్యవహరించనున్నదని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్​ చేయనున్నట్లు కూడా పార్టీలో చర్చలు జరిగాయి.

జగ్గారెడ్డి సస్పెండ్​ అవుతున్నారని, అధిష్టానం సమాచారం పంపిందని పలువురు కాంగ్రెస్​ నేతలు ప్రచారం చేసుకున్నారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ.. రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.‌ ఇలా ఉండగా అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు రావడం.. కాంగ్రెస్​తో పాటు రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. రాహుల్​ గాంధీతో జరిగే భేటీలో జగ్గారెడ్డి ఏం చర్చించనున్నారు..? ఆ తర్వాత జగ్గారెడ్డికి తొలగించిన పార్టీ పదవులు తిరిగి ఇస్తారా..? ఆయన విషయంలో అధిష్టానం ఎలా స్పందించనున్నదనే అంశాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.

Tags:    

Similar News