'నేనే హెడ్.. నీ దిక్కున్న చోట చెప్పుకో'.. ఆర్టీసీ బస్సులో అధికారి హల్ చల్..

దిశ, కమ్మర్ పల్లి: నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ డిపోకు చెందిన ఓ అధికారి, ప్రయాణికుల- Latest Telugu News

Update: 2022-04-06 15:08 GMT

దిశ, కమ్మర్ పల్లి: నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ డిపోకు చెందిన ఓ అధికారి, ప్రయాణికుల పట్ల దుర్భాషలాడుతూ పలువురిని బెదిరించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కమ్మర్పల్లి బస్టాప్ వద్ద ఓ అధికారి బస్సును ఆపి టికెట్లు తీసుకుంటూ, చెకింగ్ చేయడానికి తనకు అన్ని అధికారాలు ఉన్నాయి, అవసరమైతే ఫైన్ కూడా వేస్తాను.. నన్ను ఎవరు ఏమి చేయాలేరు.. నేనే నిజామాబాద్ జిల్లా అన్ని డిపోలకు హెడ్‌ను, మా ఇష్టం వచ్చిన చోట బస్సును ఆపుతాను.. అవసరమైతే బస్సులోంచి ప్రయాణికుల్ని బయటకు గెంటేస్తాను అని పలువురు ప్రయాణీకుల పట్ల దుర్భాషలాడి బస్ పాసులు తీసుకోవడం జరిగింది. ఈ విషయమై మేము ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తామని ఓ యువకుడు తెలపగా.. వాడే పనికిమాలినోడు మమ్మల్ని పీకేది ఎవడు అని సదరు యువకుడికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం సదరు అధికారి వరంగల్ డిపోకు చెందిన ఒక బస్సును ఆపి అందులో ఉన్న ప్రయాణికుల పట్ల ఇష్ట రీతిన వ్యవహరించాడు. కొందరు ప్రయాణికులు, యువకులు దూర ప్రయాణాలు చేసే వాళ్లం ఉన్నాము ఎంతసేపు బస్సు ఆపుతారు అని ప్రశ్నించారు. దీనితో ఆ అధికారి నా ఇష్టం ఉన్న చోట ఆపుతా.. నేను చదువుకుని జాబ్‌లోకి వచ్చాను, నన్ను పీకేది ఎవడు లేడు అంటూ ప్రయాణికులతో, మహిళలతో దుర్భాషలాడాడు. అంతేకాకుండా ఓ యువకుడి బస్సు పాస్ లాక్కొని ఏం చేసుకుంటావో చేసుకో.. నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఆ యువకున్ని బస్ నుండి బయటకు లాగేసాడు. అధికారి తీరుపట్ల బాధిత యువకుడు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు వాట్సప్ ద్వారా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News