తొలిసారి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి భేటీ (వీడియో)
ఇటీవల వరుస వివాదాల తర్వాత సీఎల్పీలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది.
దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల వరుస వివాదాల తర్వాత సీఎల్పీలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. ఈడీ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి సీఎల్పీకి వచ్చారు. ఇదే సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడే ఉన్నారు. దీంతో ఇద్దరూ ఆప్యాయతతో కౌగిలించుకున్నారు. ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి మీడియాకు ఫోజులిచ్చారు.
వివాదాల తర్వాత తొలిసారి
రేవంత్ రెడ్డికి టీపీసీసీ పట్టం తర్వాత జగ్గారెడ్డి తరుచూ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగారు. రేవంత్‌రెడ్డిని పదవి నుంచి తొలిగించాలనే డిమాండ్ మాత్రమే కాకుండా.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై సైతం వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు, నిరుద్యోగుల అంశం, ఐఏఎస్‌లపై రేవంత్ చేసిన విమర్శలను జగ్గారెడ్డి కొట్టిపారేస్తూ వచ్చారు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల కిందట అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎల్పీకి రేవంత్‌రెడ్డి వచ్చారు. అదే సమయంలో సీఎల్పీలోనే ఉన్న జగ్గారెడ్డి.. రేవంత్ రావడంతో చాంబర్‌కు వెళ్లకుండానే బయటకు వెళ్లిపోయారు.
తాజాగా శుక్రవారం సీఎల్పీకి వచ్చిన రేవంత్‌రెడ్డి నేరుగా సీఎల్పీ నేత చాంబర్‌కు వెళ్లిన సమయంలో అక్కడే జగ్గారెడ్డి ఉన్నారు. దీంతో ఇద్దరూ పలుకరించుకుని చేతిలో చేయ్యి వేసి మీడియాకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి చలోక్తులు విసిరారు. తామిద్దరిదీ ఒకే స్కూల్ అంటూ పేర్కొన్నారు. జగ్గన్నా.. తాను ఒక్కటేనని, పార్టీ కోసమే పని చేస్తామంటూ వ్యాఖ్యానించారు. వీరిద్దరి భేటీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.