'వన్ కిడ్నీ విలేజ్'.. అది తట్టుకోలేక కిడ్నీలు అమ్ముకుంటున్న ఆ గ్రామస్తులు!
దిశ, ఫీచర్స్: కరువు కాటేసింది. పని దొరకని పరిస్థితి నెలకొంది. చేతిలో- LATEST TELUGU NEWS
దిశ, ఫీచర్స్: కరువు కాటేసింది. పని దొరకని పరిస్థితి నెలకొంది. చేతిలో చిల్లి గవ్వ లేదు. ఇంట్లో తిండి గింజ లేదు. మరోవైపు భార్యాపిల్లలు ఆకలికి అల్లాడుతున్నారు. చాలా రోజులుగా కేవలం నీటితోనే కడుపు నింపుకుంటున్నారు. కానీ ఎన్నాళ్లీ పరిస్థితి. అందుకే ఆకలి బాధలు భరించలేక.. కిడ్నీలను అమ్ముకుంటున్నారు. బతికేందుకు ఒక కిడ్నీ చాలని, మరో కిడ్నీతో ఆకలి బాధకు స్వస్తి చెప్పాలని అనుకుంటున్నారు. ఆ గ్రామంలో దాదాపు అందరూ కూడా ఒక కిడ్నీ కలిగి ఉన్నవారే కాగా.. ఈ 'వన్ కిడ్నీ విలేజ్' కథేంటి..? ఎక్కడుంది?
ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇక గతేడాది తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత మరింత పతనమైంది. దీంతో పేదరికంలో కూరుకుపోయిన ఆప్ఘన్ పౌరులు ఆకలి తీర్చుకునేందుకు కిడ్నీలను అమ్ముకుంటున్నారు. తద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబీకుల కడుపు నింపుతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో మానవ అవయవాల అక్రమరవాణా చట్టవిరుద్ధం, కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో అలాంటి చట్టమేమీ లేదు. దాత రాతపూర్వక సమ్మతిని అందజేస్తే వైద్యులు ఆపరేషన్ చేసే అవకాశముండగా, ఆ కిడ్నీలు ఎక్కడికి వెళతాయో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్‌లో ఎన్ని కిడ్నీలు అమ్ముడయ్యాయో కచ్చితంగా తెలుసుకోవడం అసాధ్యం. అయితే గత కొన్నేళ్లుగా హెరాత్ ప్రావిన్స్‌లోనే వందల సంఖ్యలో కిడ్నీ తొలగింపు ఆపరేషన్లు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. ప్రజల ఆర్థిక సమస్యలు దిగజారుతున్న కొద్దీ, ఒక కిడ్నీతో బతుకీడుస్తూ మరో కిడ్నీని అమ్ముకుంటే మంచిదేనన్న అభిప్రాయానికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో 'షెన్‌షైబా బజార్' గ్రామస్తులు దాదాపు అందరూ కిడ్నీలను అమ్ముకుని ఒంటి కిడ్నీతో జీవిస్తున్నారు.
'నా భర్త పని చేయడం లేదు, మాకు అప్పులు ఉండటంతో నా కిడ్నీని 250,000 ఆఫ్ఘనిస్ ($2,900)కు అమ్మాను' అని ఓ మహిళ మీడియాతో చెప్పుకుంది. ఇక మరో స్త్రీ తన పిల్లలు అడుక్కుంటూ వీధుల్లో తిరుగుతున్నారని, తన కిడ్నీని అమ్మకపోతే.. ఏడాది వయసున్న కూతురిని అమ్మవలసి వస్తుందని వాపోయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వచ్చిందంటున్న చాలా మంది పురుషులు.. ఇక భవిష్యత్తులో కష్టంతో కూడుకున్న పనులు చేయలేమని, బరువులు ఎత్తలేమని బాధపడ్డారు.
3.89కోట్లకు పైగా జనాభా ఉన్న ఆప్ఘన్‌లో 59 శాతం జనాభా కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. ప్రపంచంలోని పేదదేశాలలో ఇదీ ఒకటి కాగా తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అర మిలియన్ మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోవడం గమనార్హం. ప్రస్తుతం ఆ దేశం ఆర్థికంగా ఘోరమైన పరిస్థితుల్లో ఉందనేందుకు ఈ ప్రజల జీవనమే నిదర్శనం కాగా. ఈ 'వన్ కిడ్నీ విలేజ్' ఉదంతం నేపాల్‌లోని హోక్సే గ్రామ ప్రజల ఉదంతాన్ని గుర్తుచేస్తోంది. ఇక్కడ కూడా చాలామంది తమ అవసరాలను తీర్చుకునేందుకు వారి కిడ్నీలలో ఒకదాన్ని అమ్ముకున్నారు.