ఈటల భూములపై మళ్లీ ఎంక్వైరీ? ఇరుకున పెట్టేందుకు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్?

దిశ, తెలంగాణ బ్యూరో: గజ్వేల్ పై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మరోసారి గెలిచి సత్తా చాటాలని, ఈటలను ఓడించి కళ్లెం వేసేందుకు పకడ్బందీ చ

Update: 2022-07-27 01:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గజ్వేల్ పై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మరోసారి గెలిచి సత్తా చాటాలని, ఈటలను ఓడించి కళ్లెం వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతుంది. ఈటల పోటీ చేస్తానని, కేసీఆర్ ను ఓడిస్తానని పదేపదే ప్రకటనలు చేస్తుండటంతో గులాబీ పార్టీ పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తుంది. మరోపక్క ఈటల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మరోసారి ఆయన భూములపై ఎంక్వైరీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. అంతేకాదు ఈటల అనుచరులపై, వారు చేసే కబ్జాలు, దందాలు చేస్తున్నారా? అనేదానిపై సైతం ఆరా తీస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి ఆయన గులాబీ బాస్ కేసీఆర్ పైన గానీ, టీఆర్ఎస్ పైనగానీ విమర్శలు, ఆరోపణలు చేయకుండా ముప్పేట దాడికి సన్నద్ధమవుతోంది అధిష్టానం. అందుకోసం అధికార పార్టీ ప్రణాళిలు సిద్ధం చేస్తోంది.

గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అయితే ఈ నియోజకవర్గంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని, రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేసింది. అందులో భాగంగా ఈటల రాజేందర్ ను ఆ నియోజకవర్గంలో పోటీ చేయించేందుకు స్పీడ్ పెంచారు. కేసీఆర్ ను ఓడించి ఈటల తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని భావిస్తుండటం, మహబూబ్ నగర్ లో జరుగుతున్న రైతుగోస బీజేపీ భరోసా యాత్రలో పాల్గొంటూ టీఆర్ఎస్, కేసీఆర్ పైవిమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ను ఓడించకపోతే ఈ జన్మకు సార్థకత ఉండదని ఈటల ప్రకటించడంతో టీఆర్ఎస్ సైతం సీరియస్ గా తీసుకుంది. ఈటల దూకుడుకు కళ్లేం వేసేందుకు సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే మరోసారి ఈటల భూములపై సర్వే చేయించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 87 ఎకరాల భూమిని కబ్జా చేశారని అధికారులు తేల్చి పేదలకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈటలకు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ పదవి అప్పగించడంతో కేసీఆర్ పై మరోసారి మాటల తూటాలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఎక్కడ పోటీచేసినా ఆయనపై పోటీ చేసి ఓడిస్తానని బహిరంగంగా సవాల్ విసురుతున్నారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈటల విమర్శలను తిప్పికొడుతున్నారు. ఈటల మంత్రిగా బీసీ, ఎస్సీల భూములు కబ్జాలు చేశారని వాటన్నింటిపై ఎంక్వైరీ చేయించి బయటపెడతామని, కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతామని టీఆర్ఎస్ ప్రకటించింది. అంతేకాదు దమ్ముంటే హుజూరాబాద్ లోనే పోటీ చేసి గెలవాలని సవాల్ విసరుతూనే మరో వైపు గజ్వేల్ పై దృష్టిసారిస్తున్నారు.

ఈటల అనుచరులపై ఆరా

ఈటల రాజేందర్ విమర్శలకు పదును పెట్టడంతో ఆయనను నిలువరించేందుకు అధికార టీఆర్ఎస్ సైతం అదే స్పీడ్ తో అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈటలతో ఎవరెవరూ ఉన్నారు..? ఆయన అనుచరులు కబ్జాలు, దందాలు ఏమైనా చేస్తున్నారా? చేస్తే వాటిని సైతం వెలుగులోకి తీసుకొచ్చేలా ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అనుచరుల వివరాలను సైతం సేకరిస్తున్నారు. వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి ఈటలకు దూరం చేసేలా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఈటలను ఒంటరిని చేస్తే ఆయన దూకుడు తగ్గుతుందని, ఎన్నికల వరకే పక్కా ప్రణాళికలతో కట్టడి చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు గజ్వేల్ లో పోటీ చేస్తే ఓడించాలని రాజకీయంగా కూడా ఈటలను దెబ్బకొట్టాలని గులాబీ నేతలు భావిస్తున్నారు.

పక్కా ప్రణాళికలు...

ఈటలకు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యం, మంత్రిగా అవకాశం ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టారని ప్రజలకు వివరించేలా టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. అంతేకాదు ఈటల భూకబ్జాలకు పాల్పడ్డాడని, మోసకారి అని ప్రజలకు వివరించడంతో బీజేపీకి యువత, ప్రజలు ఆకర్షితులు కాకుండా గజ్వేల్ నియోజకవర్గమంతా టీఆర్ఎస్ పక్షంగా ఉండేలా ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఈటల దరిచేరకుండా, ఒక వేళ పోటీ చేసినా ఒంటరిని చేసేలా గులాబీ అధిష్టానం స్కెచ్ వేస్తోంది. మెదక్ జిల్లాతో పాటు కరీంనగర్ నేతలను సైతం గజ్వేల్ లో మోహరించి టీఆర్ఎస్ ను గెలిపించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈటల మాట్లాడే ప్రతి మాటను తిప్పికొట్టనున్నారు. మాటలతో ముప్పేట దాడి చేయడంతో ఆయనను ఇరుకున పెట్టేలా కార్యచరణ చేపడుతున్నారు. ఈటలను ఓడించి బీజేపీకి చెక్ పెట్టేందుకు అస్త్రశస్త్రాలను సన్నద్ధం చేస్తున్నారు.


Similar News