Telangana News: ఇళ్లపై నల్లజెండా ఎగరేయకుంటే రైతుబంధు కట్!
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నల్లజెండాలు ఎగురవేయడం, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈక్రమంలో దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతులు తమ ఇళ్ల పై నల్లజెండా ఎగురవేయకపోతే రైతుబంధు ఇవ్వబోమని ఓ మంత్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేగాకుండా, నేను రైతునే అని జబ్బలు చరుచుకునే కేసీఆర్ నివాసం ఉండే ప్రగతి భవన్, ఫాంహౌస్‌ల పై నల్ల జెండా ఎందుకు ఎగరేయలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.