రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న పోలీస్ కమిషనర్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాబోయే సాధారణ - Police Commissioner KR Nagraj is all set to contest the upcoming elections
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాబోయే సాధారణ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తన మనసులోని మాటను బయట పెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చిందని, ఇంకా సర్వీస్ ఉండటంతో సీఎం కేసీఆర్ ఇప్పుడే ఎన్నికల్లో పోటీ వద్దని చెప్పారని తెలిపారు. రాబోయే ఎన్నికల నాటికి తన పోలీస్ విధి నిర్వహణ బాధ్యతలు ముగుస్తాయని, అప్పుడు తాను పోటీ చేసే అవకాశం ఉందన్నారు.
నిజామాబాద్ నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తో పాటు లోకల్ ఎమ్మెల్యేను కలిసి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం ట్రాఫిక్ పై సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి, తగు సూచనలు సలహాలు ఇస్తున్నట్టు వివరించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్నదే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయం అన్నారు. జనవరిలో రోడ్డు ప్రమాదాల్లో కేవలం నిజామాబాద్ నగరంలో 20 మందికి పైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 300 మంది యువత గంజాయి సేవిస్తున్నట్టు గుర్తించి.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. జిల్లాలో గంజాయి పండించే రైతుల విషయంలో జిల్లా కలెక్టర్ కు లేఖ రాసి వారికి ప్రభుత్వ పథకాల సహాయం నిలిపివేయిస్తామన్నారు. గంజాయి పై ఉక్కు పాదం మోపుదిశలో ఆబ్కారీ శాఖ తో కలిసి సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. జిల్లాలో పెద్ధ మొత్తంలో గంజాయి విక్రయాలపై సమాచారం అందిస్తే వారి వివరాలను రహస్యంగా ఉంచి, వారికి రివార్డు కూడా ఇస్తామన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు చౌరస్తాలలో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చగాళ్ల, హిజ్రాల వేధింపులపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. అ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్ లో చిన్న పిల్లలతో బిక్షటన పై ప్రత్యేక నజర్ వేశామని.. స్వచ్చంధ సంస్థలు ముందుకు వస్తే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
పోలీస్ శాఖలో పనిచేసే వారు కూడా చట్టానికి అతీతులు కాదని అన్నారు. తాను పోలీస్ కమిషనర్ గా విధుల్లో చేరినప్పటి నుంచి నలుగురిపై వేటు వేశామని, ఒక్కరిని పూర్తిగా విధుల నుంచి తొలగించడం జరిగిందని పోలీస్ కమిషనర్ నాగరాజు పేర్కొన్నారు.