నిబంధనల మేరకే వాటికి అనుమతులు: హన్మకొండ కలెక్టర్

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: నిబంధనల మేరకే లేఔట్లకు అనుమతులు జారీ చేస్తామని..Permissions as per regulations: Hanmakonda Collector

Update: 2022-03-09 13:32 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: నిబంధనల మేరకే లేఔట్లకు అనుమతులు జారీ చేస్తామని హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ కలెక్టర్ డా. బి.గోపిలు స్పష్టం చేశారు. బుధవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయంలో టీఎస్ బైపాస్ లో 10 ఎకరాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల అనుమతులకు తాత్కాలిక అనుమతుల జారీకి ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో హన్మకొండ, వరంగల్ కలెక్టర్లతోపాటు బల్దియా కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుమతుల మంజూరుకు ప్రభుత్వ ఉత్తర్వులు 105లో సూచించిన నిబంధనల మేరకు టీఎస్ బైపాస్ ఆన్ లైన్ లో చేసుకున్న 3 దరఖాస్తులు కమిటీ ముందుకు వ‌చ్చాయి. అందులో రెండింటికి అనుమతులు మంజూరు చేశారు. నిబంధనల మేరకు లేని ఓ దరఖాస్తును తాత్కాలికంగా తిరస్కరించారు. బల్దియా పరిధిలో 10 ఎకరాల లోపు లేఔట్ స్థలాలకు టైటిల్ డీడ్, టెక్నికల్ వెరిఫికేషన్ ను కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిర్వహిస్తారని, సైట్ వెరిఫికేషన్ డీటీసీపీ నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రతిపాదనలను కలెక్టర్‌కు నివేదించమని తెలిపారు.

ఈ దరఖాస్తులపై కలెక్టర్లు అంగీకారం కానీ తిరస్కరణ అంశాన్ని గానీ కమిషనర్ కు పంపిస్తామన్నారు. ఈ కమిటీలో కన్వీనర్ గా బల్దియా కమిషనర్, నోడల్ అధికారిగా సిటీ ప్లానర్ తోపాటు బల్దియా, ఆర్ అండ్‌ బీ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ ఎస్ఈలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. కుడా పరిధిలోని లేఔట్ స్థలాల అనుమతులను కుడా వైస్ చైర్మన్ కు పంపిస్తామని తెలిపారు. నిబంధన ప్రకారం ఉంటే అనుమతులు మంజూరు చేస్తారని, లేఔట్ స్థలాల నివేదికను కలెక్టర్, డీటీసీపీలకు పంపించడం జరుగుతుందన్నారు. తాత్కాలిక అనుమతులు పొందిన లే ఔట్ లో 2 సంవత్సరాలలోగా లైటింగ్ ఏర్పాటు, డ్రైనేజీలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు ఉన్నచో శాశ్వత అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, హన్మకొండ, వరంగల్ అదనపు కలెక్టర్లు సంధ్య రాణి, బి. హరి సింగ్, హన్మకొండ, వరంగల్ ఆర్డీవోలు వాసు చంద్ర, మహేందర్ జీ, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ ఎస్ఈలు సత్యనారాయణ, సుధాకర్ రెడ్డి, కూడా పీవో అజిత్ రెడ్డి, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, బల్దియా పట్టణ ప్రణాళిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News