అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ తయారీ ప్లాంట్‌ నిర్మించే యోచనలో ఓలా ఎలక్ట్రిక్!

Update: 2022-02-24 13:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా భారత్‌లో 50 గిగావాట్‌అవర్‌ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ సెల్ తయారీ ప్లాంట్‌ను నిర్మించాలని భావిస్తోంది. ఓలా, ఏడాదికి కోటి ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునేందుకు 40 గిగావాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యం అవసరం. మిగిలిన సామర్థ్యాన్ని భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించినట్టు రాయిటర్స్ పేర్కొంది. 2023 నాటికి 1 గిగావాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యాన్ని సిద్ధం చేసి ఆనంతరం 3-4 ఏళ్లలో 20 గిగావాట్ అవర్‌కు విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఓలా దాదాపు రూ. 7,500 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దక్షిణ కొరియా నుంచి బ్యాటరీ సెల్‌లను దిగుమతి చేసుకుంటున్న ఓలా, అధునాతన సెల్, బ్యాటరీ టెక్నాలజీ కలిగిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఇందుకోసం భారత్‌లో బ్యాటరీ పరిశోధనా, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాటరీ, సెల్ పరిశోధన, అభివృద్ధి ఎంతో ముఖ్యమైనది. ప్రస్తుతం కంపెనీ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. రానున్న రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే మెయిల్ ద్వారా స్పందించారు.

Tags:    

Similar News