నెరవేరని ప్రభుత్వ లక్ష్యం.. పట్టించుకోని అధికారులు

దిశ,తిరుమలాయపాలెం: ప్రభుత్వం మారుమూల తండా ప్రాంతంల్లోని ప్రజలకు రహదారి సౌకర్యం.. Latest Telugu News..

Update: 2022-03-17 06:10 GMT

దిశ,తిరుమలాయపాలెం: ప్రభుత్వం మారుమూల తండా ప్రాంతంల్లోని ప్రజలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఎన్నో వినతులు వెల్లువతో నిర్మాణమైన రహదారి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పట్టుమని సంవత్సరకాలం గడవకముందే రహదారి శిథిలావస్థ అంచున నిలిచింది. మండలంలోని బచ్చోడుతండా పంచాయతీ పరిధిలోని బడవతండాలో ఐటీడీఏ భద్రాచలం వారి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చేశారు. గతంలో రోడ్డు నిర్మాణానికి ముందు తండా వాసులకు సడన్గా జబ్బు చేస్తే వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లాలన్న సరైన మార్గం లేక ఎన్నో అవస్థలు పడ్డామని అంటున్నారు. తమ సమస్యను తీర్చాలని అధికారులను, అప్పటి మంత్రి తుమ్మలను ఓపిసులో కలిసి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి, తమ సమస్య తీర్చాలని మొరపెట్టుకున్నామని వారు తెలిపారు.

తండా వాసుల కల సాకారం చేస్తూ రూ.1.4 కోట్లతో ఐటీడీఏ ఆధ్వర్యంలో తండాకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. బడవతండా నుంచి బచ్చోడుతండా వరకు, 2 కాల్వర్ట్ ఏర్పాటుతో కిలోమీటరు బీటి రోడ్డు నిర్మాణం చేశారు. వర్షాకాలంలో రోడ్డు వైపు వరద తాకిడి అధికంగా ఉంట్టుందిని, బ్రిడ్జి నిర్మాణం చేస్తే అరికట్టవచ్చని తాండవాసులు మోర పెట్టుకున్నా అధికారులు, గుత్తేదారులు అవేమీ పట్టించుకోకుండా,పైనుంచి వచ్చే వరద అంచనా వేయకుండా బ్రిడ్జికి బదులు మోరీలు వేసి చేతులు దులుపుకున్నారని తండా వాసులు ఆరోపిస్తున్నారు. అందుకు ఫలితంగా పోయిన వర్షాకాలం సీజన్‌లో కురిసిన వర్షానికి వరద పోటెత్తడంతో మోరీలు ఇరుకుగా ఉండడం వలన రోడ్డుపై నుంచి భారీగా వరద పారడం వలన 150-200 మీటర్ల వరకు రోడ్డు కోతకు గురైంది.

దీంతోపాటు రోడ్డు నిర్మాణంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా గుత్తేదారులు ఇష్టానుసారంగా రోడ్డు పనులు చేసి చేతులు దులుపుకోవడంతో ఇప్పుడు రోడ్డు పై గుంటలు ఏర్పడుతున్నాయని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వర్షాలు మొదలు కాకముందే కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తండావాసులు మొర పెట్టుకుంటున్నారు.

ఐటీడీఏ ఇన్చార్జి ఏఈ మూర్తి వివరణ

దీనిపై ఐటీడీఏ ఇంచార్జ్ ఏఈ మూర్తిని దిశ చరవాణిలో వివరణ కోరగా రోడ్డు కోతకు గురైన సంగతి తమ దృష్టికి రాలేదని అన్నారు. కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేయించి వరద వెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News