పేరు మారదు.. అధికారుల తీరు మారదు.. అంతా ఆయనే చేతుల్లోనే..!

సరిగ్గా నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన ఆ విగ్రహా ప్రారంభోత్సవంలో తప్పు జరిగినా కనీసం సరిదిద్దుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది

Update: 2022-04-09 11:09 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: సరిగ్గా నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన ఆ విగ్రహా ప్రారంభోత్సవంలో తప్పు జరిగినా కనీసం సరిదిద్దుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది అధికారులకు. బాహాటంగానే జరిగిన పొరపాటుపై సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఈ నెల 5న రేకుర్తిలోని విజయపురి కాలనీలో బాబు జగ్జీవన్ రాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఏకంగా ప్రజా ప్రతినిధి పేరునే మార్చేశారు. 18వ డివిజన్ కార్పొరేటర్‌గా గత కార్పొరేషన్ ఎన్నికల్లో సూదగోని మాధవి గెలిచారు. అయితే విగ్రహావిష్కరణ శిలాఫలకంపై మాత్రం ఆమె భర్త కృష్ణగౌడ్ 18 డివిజన్ కార్పొరేటర్ అంటూ చెక్కించారు. అధికారికంగా మాధవి కార్పొరేటర్ అయితే ఆమె భర్త పేరు పెట్టడంపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ బల్దియా అధికారులు మాత్రం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్దంగా ఏకంగా ప్రజా ప్రతినిధి పేరునే మార్చిన ఘనతను దక్కించుకున్న కార్పొరేషన్ యంత్రాంగం మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం విడ్డూరం.

ప్రోటోకాల్‌కు విరుద్దం

ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్దంగా ప్రజాప్రతినిధి భర్త పేరును శిలాఫలకంపై చేర్చడం ఘోర తప్పిదమేనని అధికార వర్గాలు అంటున్నాయి. గతంలో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నట్టయితే సంబంధిత యంత్రాంగంపై క్రమ శిక్షణ చర్యలు తీసుకునేవారు. కానీ విజయపురి కాలనీలో ఏర్పాటు చేసిన శిలాఫలకం విషయంలో కనీసం పేరును మార్చేందుకు కూడా అధికారులు చొరవ తీసుకోకపోవడం విచిత్రంగా మారింది. కలెక్టరేట్‌లో కూడా ప్రోటోకాల్ నిబంధనలు అమలు చేసేందుకు ప్రత్యేకంగా వింగ్ ఉన్నప్పటికీ ఈ విషయంపై జిల్లా యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బల్దియా అధికారులు చేసిన ఈ తప్పుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే బల్దియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ ప్రజాప్రతినిధి శిలాఫలకంపై పేరును సవరించాల్సిన అవసరం లేదని సూచించారని కూడా ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నాయకులైనంత మాత్రాన గెలిచిన అభ్యర్థి స్థానంలో ఆమె భర్త పేరును చేర్చడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

Tags:    

Similar News